సాక్షి, అమరావతి: ప్రపంచం మొత్తం వేనోళ్ల కీర్తిస్తున్న ఆర్బీకే వ్యవస్థను అప్రదిష్టపాల్జేయడం, రైతులకు అండగా నిలుస్తూ వారిని చేయిపట్టి నడిపిస్తున్న ఆర్బీకే సిబ్బందిపై ఇప్పుడు రామోజీ కన్నుపడింది. రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విషం కక్కడమే పనిగా పెట్టుకున్న ఆయన ఈసారి వారి మనోస్థైర్యం దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఓ ఆర్బీకే సిబ్బంది మరణాన్ని సైతం రాజకీయం చేస్తూ చావు తెలివితేటలను ప్రదర్శించింది. వ్యక్తిగత కారణాలతో ఆర్బీకే ఉద్యోగిని ఒకరు బలవన్మరణానికి పాల్పడితే, దాన్ని వక్రీకరిస్తూ ‘ఆర్బీకే ఉద్యోగిని ప్రాణం తీసిన ఎరువుల విక్రయాలు’ అంటూ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇష్టారాజ్యంగా అబద్ధాలను అచ్చేసింది. ఈనాడు కథనంలోని అంశాలపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే..
బకాయిలపై ఎలాంటి ఒత్తిడిలేదు
బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలి–1 ఆర్బీకేలో గ్రామ వ్యవసాయ సహాయకురాలుగా మూడున్నరేళ్ల నుంచి సమర్థవంతమైన సేవలందిస్తున్న బి.పూజిత శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. కారణాలు ఏమైనప్పటికీ ఆమె మరణం బాధాకరం. కానీ, ఎరువుల బకాయిలపై ప్రభుత్వాధికారులు ఒత్తిడిని తట్టుకోలేకే ఆమె అఘాయిత్యానికి ఒడిగట్టిందంటూ ఈనాడు చేసిన ఆరోపణలు విస్మయానికి గురిచేస్తున్నాయి.
వాస్తవానికి.. ఈ ఆర్బీకే ద్వారా రైతులకు సరఫరా చేసిన ఎరువులకు సంబంధించిన బకాయిలు అక్షరాల కేవలం రూ.16 మాత్రమే. ఈ కొద్దిపాటి సొమ్ము కోసం ఒత్తిడి తీసుకొచ్చారనడం ఎంతో హాస్యాస్పదం. ఆర్బీకేలో నిల్వచేసిన తడిసి, పాడైన ఎరువుల తాలూకు విలువను ఆర్బీకే సిబ్బంది నుంచి వసూలు కోసం ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకొచ్చారని ఈనాడు మరో ఆరోపణ చేసింది.
నిజానికి.. వర్షాలు, ఇతర వైపరీత్యాల సందర్భంలో తడిసిన, గడ్డకట్టిన, పాడైన ఎరువులను సంయుక్త విచారణ ద్వారా నిర్ధారించి వాటిని రద్దుచేసి, ఆ మేరకు సొమ్మును బకాయిల నుంచి మినహాయిస్తున్నారే తప్ప ఏ ఒక్క ఆర్బీకే నుంచి వసూలుచేసిన దాఖలాల్లేవు. ఇప్పటివరకు సంయుక్త విచారణలో ఇలా వైపరీత్యాలవల్ల పాడైనట్లుగా గుర్తించిన రూ.8.4 లక్షల విలువైన 15 టన్నుల ఎరువులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
సకాలంలో అద్దె జమ..
ఇక ఆర్బీకే అద్దెల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.43 కోట్లు ఖర్చుచేసింది. రానున్న మార్చి వరకు సర్దుబాటు చేసేందుకు మరో రూ.32.98 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే రూ.22.98 కోట్లు భవన యజమానుల ఖాతాల్లో జమచేశారు. పెండింగ్‌లో విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు విడుదల చేయగా, ఇక నుంచి నేరుగా ఈ బడ్జెట్‌ను విద్యుత్ శాఖకే కేటాయించేలా ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, స్టేషనరీ కోసం రూ.3 కోట్లు విడుదల చేయగా ఇప్పటికే ఖర్చుచేసిన సిబ్బందికి రూ.53.48 లక్షలు విడుదల చేశారు.
ఇంటర్నెట్ కోసం కూడా రూ.23 కోట్లు విడుదల చేశారు. ఇలా రైతుల అవసరాలను తీరుస్తూ వారికి అడుగడుగునా అండగా నిలుస్తున్న ఆర్బీకేలపై నిత్యం అదే పనిగా బురద జల్లడం, సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతీసేలా దుర్మార్గపు రాతలు రాస్తోంది. ఈ క్షుద్ర పాత్రికేయాన్ని ఇకనైనా మానుకోవాలని రైతులు ఈనాడు రామోజీకి సూచిస్తున్నారు.
ఆర్బీకేల్లో ఎరువుల విక్రయం వ్యాపారం కాదు..
ఇక రైతుభరోసా కేంద్రాల్లో ఎరువుల అమ్మకం వ్యాపారం కాదని, రైతులకు గ్రామస్థాయిలో చేసిన ఓ సదుపాయం మాత్రమే. నిజానికి.. రాష్ట్రానికి సరఫరా అయ్యే ఎరువుల్లో 50 శాతం వ్యాపారులకు, మిగిలిన 50 శాతం సహకార కేంద్రాలు, ఆర్బీకేలకు కేటాయిస్తున్నారు. ఆర్బీకేలు ఏర్పాటుచేసిన తొలి ఏడాది 1.07 లక్షల టన్నుల అమ్మకాలు జరగ్గా.. మూడో ఏడాదికి వచ్చేసరికి అది నాలుగు లక్షల టన్నులకు చేరుకుంది.
ఈ సదుపాయం వినియోగించుకున్న రైతుల సంఖ్య 2020–21లో 2.55 లక్షల మంది ఉంటే, 2022–23లో ఏకంగా 10.90 లక్షల మందికి చేరింది అంటే.. 428 శాతం వృద్ధి కన్పిస్తోంది. గ్రామస్థాయిలో ఎమ్మారీ్పకే ఎరువులు అందుబాటులో ఉంచడంతో.. బ్యాగ్‌పై రూ.20–50 వరకు రవాణ, లోడింగ్, అన్‌లోడింగ్ భారం తగ్గడంతో రైతులు ఆర్బీకేల ద్వారా ఎరువులు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ–క్రాప్ నమోదులోనూ ఒత్తిడి లేదు..
మరోవైపు.. వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఉమ్మడి అజమాయిషీ కింద జరుగుతున్న ఈ–క్రాప్ నమోదు కోసం టైమ్‌లైన్ నిర్దేశించారే తప్ప సిబ్బందిపై ఎలాంటి ఒత్తిడిలేదు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. ఖరీఫ్ 2023 నుండి జియో ఫెన్సింగ్ అమలుచేస్తున్నారు.
ఆర్బీకే సిబ్బంది అభ్యర్థన, ఫీడ్‌బ్యాక్ మేరకు వరి పంటకు జియో ఫెన్సింగ్‌ను 20 నుంచి 200 మీటర్లకు పెంచడమే కాదు.. అవసరమైతే క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి మినహాయింపు కూడా ఇస్తున్నారు. అలాగే.. వైఎస్సార్ రైతుభరోసా మాస పత్రిక కోసం ఇప్పటివరకు 14,300 మంది రైతులు స్వచ్ఛందంగా బుక్ చేసుకున్నారు. ఈ విషయంలో సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారనడంలో కూడా ఎలాంటి వాస్తవంలేదు.
Comments
Please login to add a commentAdd a comment