కడప– అనంతపురం ప్రధాన రహదారిలో కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై వరద నీటికి కొట్టుకు పోయిన బ్రిడ్జి
సాక్షి, అమరావతి, నెట్‌వర్క్: ఏపీలోని రాయలసీమ, నెల్లూరు జిల్లాలను ముంచెత్తిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా తేరుకుంటున్నాయి. వరదలు ఇంకా పూర్తిగా శాంతించలేదు. రైలు పట్టాల కిందకు నీరు చేరి ఉధృతికి కొట్టుకుపోవడంతో విజయవాడ– నెల్లూరు మార్గంలో 18 రైళ్లను రద్దు చేశారు. తిరుపతిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. సహాయక చర్యల్లో ఐదువేల మందితో కూడిన యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది.
వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్ మంత్రులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో 30 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలోనే 17 మంది మృతి చెందగా చిత్తూరు జిల్లాలో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, అనంతపురంలో ఏడుగురు మరణించారు. వరద ప్రభావిత నాలుగు జిల్లాల్లో 274 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 31,827 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మాండవ్యలో అక్కాతమ్ముడి గల్లంతు
వైఎస్సార్ కడప జిల్లాలో పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోవడంతో సంభవించిన వరదల్లో గల్లంతైన వారికి సంబంధించి 15 మృతదేహాలు లభ్యమైనట్లు కలెక్టర్ విజయరామరాజు ప్రభుత్వానికి నివేదించారు. ఆదివారం సాయంత్రానికి మరికొన్ని మృతదేహాలు బయటపడినట్లు తెలుస్తోంది. మరోవైపు రాయచోటి సమీపంలోని మాండవ్య నదిలో గల్లంతైన అక్కా, తమ్ముడి మృతదేహాలను వెలికితీశారు. మృతులను సాజియా(19), కుమారుడు జాసిన్(12)గా గుర్తించారు.
కడప– అనంతపురం ప్రధాన రహదారిలో కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై బ్రిడ్జి వరద నీటికి కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. కడప రాధాకృష్ణనగర్ ప్రాంతంలో పురాతన రెండతస్తుల భవనం ఆదివారం తెల్లవారుజామున కుప్పకూలింది. చిత్తూరు జిల్లావ్యాప్తంగా వరదల ఉదృతికి 8 మంది మృతి చెందారు. చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయులు 500 ఏళ్ల క్రితం నిర్మించిన రాయల చెరువుకు లీకేజ్ కారణంగా నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అనంతపురం జిల్లాలో నాలుగు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటంతో వాగులు, వంకలు పోటెత్తాయి.
పోటెత్తిన పెన్నా.. నెల్లూరు జిల్లాలో బీభత్సం
నెల్లూరు జిల్లాలో పెన్నా నది పొటెత్తడంతో పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. నెల్లూరు సమీపంలోని చెన్నై–కోల్‌కతా ఏషియన్ హైవే–16 జాతీయ రహదారికి శనివారం అర్ధరాత్రి పలుచోట్ల గండ్లుపడ్డాయి. పెన్నా వరద ఉధృతికి హైవే కొట్టుకుపోయి శనివారం అర్ధరాత్రి నుంచి ఇరువైపులా సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి.
ఆదివారం మధ్యాహ్నం నుంచి రాకపోకలను పునరుద్ధరించారు. పడుగుపాడు వద్ద పెన్నా వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కింద కంకర, మట్టి కొట్టుకుపోవడంతో పట్టాలు నీటి ఉధృతిలో వేలాడుతున్నాయి. దీంతో విజయవాడ– నెల్లూరు మార్గంలో 18 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. మరో పది రైళ్లను దారి మళ్లించారు. నెల్లూరు వెంకటేశ్వరపురం సాలుచింతల వద్ద పాలిటెక్నిక్ విద్యార్థి గోపి వరద నీటిలో చిక్కుకుని మృతి చెందాడు. కాగా, సోమశిల జలాశయం వెలుపలి వైపు రెండు మృతదేహాలు కొట్టుకువచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment