ఎరువుల స్టాక్‌ను పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు (ఫైల్)
ఖరీఫ్ సీజన్‌కు ముందే వ్యవసాయానికి అవసరమైన ఎరువులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో జూన్ నెల్లోనూ జలవనరులు తొణికిసలాడుతున్నాయి. జిల్లాలో ముందస్తుగా ఎడగారు మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో సాగు విస్తీర్ణం చాలా తక్కువ. అయినా ఎరువుల కొరత రైతాంగాన్ని పట్టి పీడించేది. గతంతో పోల్చుకుంటే.. జిల్లాలో గడిచిన మూడేళ్లలో ఖరీఫ్, రబీ సీజన్లలో మూడింతల సాగు విస్తీర్ణం పెరిగింది. ఇందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను సిద్ధం చేసింది.
సాక్షి,నెల్లూరు (సెంట్రల్): జిల్లాలో 2022 ఖరీఫ్ సీజన్ ముందస్తుగానే ప్రారంభమవుతోంది. ఇప్పటికే సాగు విస్తీర్ణం అంచనాకు అనుగుణంగా విత్తనాలు సిద్ధం చేసిన వ్యవసాయశాఖ తాజాగా అవసరమైన మేరకు ఎరువులు కూడా సిద్ధం చేస్తోంది. వ్యవసాయానికి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీజన్‌కు ముందే గత నెల్లోనే పెట్టుబడి సాయంగా వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద రూ.7,500 జమ చేసింది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎడగారుకు ముందుగానే ఎరువుల నిల్వలు ఉంచాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ సిద్ధం చేసింది.
109 సొసైటీల ద్వారా సరఫరా
జిల్లాలో 561 ఆర్బీకేల ద్వారా ఎరువులను గ్రామాల్లోనే రైతులకు సరఫరా చేస్తుంటారు. జిల్లాలో 470 ప్రైవేట్ డీలర్స్ కూడా ఎరువుల విక్రయాలు చేస్తున్నారు. తాజాగా జిల్లాలో వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న మార్క్‌ఫెడ్ సంస్థ పరిధిలో 109 సొసైటీల ద్వారా కూడా రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా వివిధ రకాల ఎరువులను సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో రబీ ముగిసిన తర్వాత ఖరీఫ్ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు ఎరువుల సమస్య రాకుండా నిల్వ చేశారు. జిల్లాలో యూరియా 18 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 5 వేల మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1,700 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 13 వేల మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 2 వేల మెట్రిక్ టన్నులు చొప్పున 39,700 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు లక్ష మెట్రిక్ టన్నుల వరకు ఎరువులు అవసరం అవుతాయని అంచనా. మరో 32 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల ఈ వారంలో రానున్నాయి. ప్రతి నెలా 20 వేల నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల వరకు అవసరానికి అనుగుణంగా జిల్లాకు పంపిణీ చేస్తున్నారు.
ఎరువుల కొరత ఎక్కడా లేదు
జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి నెలా కావాల్సినంత ఎరువులు జిల్లాకు వస్తున్నాయి. ఇప్పటికే 39 వేల మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. ఈ నెలకు కావాల్సిన స్టాక్ కన్నా ఎక్కువగానే నిల్వ ఉంది. రైతులు ఎవరూ ఎరువులు లేవనే అసత్య ప్రచారాలు నమ్మవద్దు. రైతులకు ఎక్కడకు వెళ్లినా ఎరువులు పుష్కలంగా ఉన్నాయి.
– సుధాకర్‌రాజు, జేడీ వ్యవసాయశాఖ
Comments
Please login to add a commentAdd a comment