సాక్షి, అమరావతి: ‘వైఎస్ జగన్ విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఏ ఒక్క పాఠశాలా మూతపడదు. ఏ ఒక్క ఉపాధ్యాయుడి ఉద్యోగం పోదు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అవసరమైనన్ని పోస్టులను భర్తీచేస్తారు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన మాట’ అని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్ జగన్‌పై విషం కక్కడమే అజెండాగా పనిచేస్తున్న ఎల్లో మీడియా తప్పుడు రాతలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యారంగంపై ఈనాడు పత్రికలో వచ్చిన కథనాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పాఠశాలల స్వరూపాన్నే మారుస్తున్న జగన్ సంస్కరణలు ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
ఎప్పుడైనా ఇన్ని ఉద్యోగాలిచ్చారా?
‘ఈ రెండేళ్లలోనే 1,83,470 రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఏడాదిలోనే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేశారు. 51,986 మందిని ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపారు. జగన్ వచ్చేనాటికి 5,14,056 ప్రభుత్వ ఉద్యోగాలుంటే.. ఇప్పుడవి 6,96,526కు చేరాయి. దేశచరిత్రలో మునుపెన్నడైనా ఇది సాధ్యమైందా? చంద్రబాబు పాలన (2014–19)లో భర్తీచేసిన ఉద్యోగాలు 34 వేలే. ఇవేవీ ఎల్లో మీడియాకు కనిపించవా? ఇంకా సిగ్గులేకుండా చంద్రబాబును మోయడమేంటి? ఆయన 625 హామీలిచ్చి తుంగలోతొక్కినా ఈ మీడియా ఏనాడైనా ప్రశ్నించిందా? ఆయన్ని అధికారంలోకి తేవాలని వైఎస్ జగన్‌పై విషం కక్కడం న్యాయమేనా? ఈ ప్రయత్నం ఎప్పటికీ ఫలించదని ఎల్లో మీడియా తెలుసుకోవాలి.
ఏ ఒక్కరి ఉద్యోగం పోదు
విద్యారంగాన్ని సమగ్ర ప్రక్షాళన చేస్తున్న నేపథ్యంలో ఏ ఒక్క స్కూలూ మూతపడదు. అంగన్‌వాడీలతో సహా ఏ ఒక్క ఉపాధ్యాయుడి ఉద్యోగమూ పోదని వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారు. ఆధునిక ఆలోచన ధోరణికి తగ్గట్టుగా అంగన్‌వాడీలను తీర్చిదిద్దుతున్నారు. ఇదో పెద్ద యజ్ఞం. మంచి విద్యావ్యవస్థ కావాలని వైఎస్ జగన్ తపిస్తున్నారు. అంగన్‌వాడీల అర్హతలు పెంచుకునేలా చేసి, పదోన్నతులు కల్పించేలా ఆలోచిస్తున్నారు. శివారు గ్రామాల్లోనూ ప్రీ ప్రైమరీ అంగన్‌వాడీ కేంద్రాన్ని పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. 3 నుంచి 5 తరగతులను హైస్కూల్ పరిధిలోకి తెస్తే 18 సబ్జెక్టులు డీల్ చేసే అనుభవజ్ఞుల ద్వారా మంచి విద్య అందుతుంది. ఈ కసరత్తు పూర్తయిన తర్వాత మొత్తం ఖాళీలు వస్తాయి. అప్పుడు వీటిని భర్తీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటప్పుడు ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాయడం ఏమిటి? జాబ్ కేలండర్ విషయంలోనూ తప్పుడు ప్రచారాన్ని యువత నమ్మవద్దు. వీలైనన్ని ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కుల గురువులు, వ్యవస్థల్లోని కీలక వ్యక్తులు, మీడియాను అడ్డుపెట్టుకుని చేసే కుట్రలు ప్రజలు సహించరని చంద్రబాబు గుర్తించాలి..’ అని సజ్జల పేర్కొన్నారు.
విద్యారంగాన్ని గాడిలో పెడుతున్నారు
విద్యావ్యవస్థను సమూలంగా మారుస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడే ఖాళీలన్నీ భర్తీచేస్తాం. క్రమబద్ధీకరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలలను మూసేశాడు. ఆయన విద్యారంగాన్ని అస్తవ్యస్థం చేస్తే.. వైఎస్ జగన్ తిరిగి గాడిలో పెడుతున్నారు. ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనానికి టీడీపీ ప్రభుత్వం రూ.515 కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్ జగన్ రూ.1,600 కోట్లు గోరుముద్ద పథకానికి ఖర్చుచేశారు. ఆయాలకు నెలకు ఇచ్చే రెమ్యూనరేషన్‌ను రూ.వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచారు. 80 వేలమంది లబ్ధిపొందారు. సమయానికి పాఠ్యపుస్తకాలు, స్కూల్ డ్రెస్‌లు అందుతున్నాయి. గతంలో ఈ పరిస్థితి ఉందా? చంద్రబాబు సొంత ఊళ్లో పాఠశాల శిథిలావస్థలో ఉన్నా ఆయన పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment