బియ్యం తీసుకొస్తామని బయలుదేరారు. సోదరుడికి ముద్దు ఇవ్వమని బతిమలాడారు. టాటా చెప్పించుకుని సంబరపడ్డారు. అంతలోనే మమ్మల్ని వదిలి అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఎలా బతికేది నాన్నా..? అంటూ ఆ చిన్నారులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ముద్దుల తమ్ముడిని తలుచుకుని గుండెలు బాదుకుంటూ ఎక్కిళ్లు పెట్టడం మరింత బాధించింది.
చిత్తూరు : కేవీపల్లె మండలం గ్యారంపల్లె కస్పా బస్టాప్ వద్ద శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుంచి వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న చిన్నగొట్టిగల్లు కాలనీకి చెందిన శంకరప్ప(32), భార్య రెడ్డిహారిక(27), కుమారుడు అఖిల్(05) అక్కడికక్కడే మృతి చెందారు.
వలస వచ్చి.. బండరాళ్లు కొట్టి..
పదేళ్ల క్రితం కర్ణాటక నుంచి 15 కుటుంబాలు వలసవచ్చాయి. చిన్నగొట్టిగల్లు కాలనీలో తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో శంకరప్పతోపాటు భార్య, ముగ్గురు బిడ్డలు ఉన్నారు. వీరు చిన్నగొట్టిగల్లు, రొంపిచెర్ల మండలాల పరిధిలో బండరాళ్లు కొట్టేవారు. బండలు, కూసాలు తీయడం లాంటివి చేసేవారు. శంకరప్ప కుటుంబం ఇటీవలే రాళ్లు కొట్టే పనుల కోసం వైఎస్‌ఆర్ కడప జిల్లా సంబేపల్లెకు వెళ్లింది. అక్కడే తాత్కాలికంగా గుడిసె వేసుకుని జీవనం సాగిస్తోంది.
రేషన్ కోసం వచ్చి అనంతలోకాలకు
శంకరప్పకు ముగ్గురు సంతానం. శ్రుతి(7), అఖిల్(5), నిహారిక(4) ఉన్నారు. వారితోపాటు అత్త కూడా నివసిస్తోంది. ఆయనకు చిన్నగొట్టిగల్లులో రేషన్ కార్డు ఉంది. శనివారం ఉదయం భార్య, కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంలో చిన్నగొట్టిగల్లుకు వచ్చారు. రేషన్ తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలో అనుకోని ప్రమాదం వారిని మృత్యువొడికి చేర్చింది. విషయం తెలుసుకున్న కుమార్తెలు బోరున విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఆ బిడ్డలను ఆ దేవుడే కాపాడాలంటూ బోరున విలపిస్తున్నారు.
నాన్నా .. మాకు దిక్కెవరు?
Published Sun, Sep 6 2020 9:05 AM | Last Updated on Sun, Sep 6 2020 11:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment