సాక్షి, ఢిల్లీ: ప్రాజెక్టుల అంశంపై కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లామని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, గురుమూర్తి, నందిగం సురేష్‌లతో కలిసి గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరామన్నారు. నిధులు ఇవ్వకుండా కేంద్రం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్నారు.
‘‘ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కాఫర్ డ్యామ్ వద్ద జలాశయంలో నీరు నిలిచింది. వర్షాకాలంలో ముంపు గ్రామాలకు ఖాళీ చేయించక పోతే మునిగి పోయే ప్రమాదం ఉంది. పోలవరానికి సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదించాలి. పోలవరానికి కేంద్రం నిధులు ఇస్తే 2022 నాటికి పూర్తి అవుతుంది. విభజన చట్టాల్లోని హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నాం. హోదాపై ప్యాకేజీకి ఒప్పుకుని చంద్రబాబు ఏపీకి అన్యాయం చేశారు. పార్లమెంట్‌లో ఏపీ కోసం వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ఆందోళన చేస్తుంటే.. సభలో టీడీపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారు. ఏపీకి సంబంధించిన డిమాండ్లను పూర్తిగా కేంద్రం నెరవేర్చాలి. ఏపీ డిమాండ్లు నెరవేరేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని’’ ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment