రాయచోటి: కార్తిక పౌర్ణమి వేళ ఆలయాలన్నీ నూతన శోభ సంతరించుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులు ప్రత్యేక స్నానాలు, పూజలతో శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలతో పాటు అన్ని ఆలయాలు భక్తుల దీపారాధనలు, పూజలతో కిక్కిరిసాయి. ఆయా ప్రాంతాలలో ఉన్న ఆలయాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. నదులు, కోనేరులు, నీటి ప్రవాహాలలో భక్తులు కార్తిక దీపాలు వదిలి ప్రత్యేక పూజలు చేశారు.
● రాయచోటిలోని శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయం, పాతరాయచోటిలోని అగస్తేశ్వరాలయం, ఎస్‌ఎన్ కాలనీలోని ఉమామహేశ్వర ఆలయాలలో మహిళా భక్తులు ప్రత్యేక దీపారాధన చేశారు. రాజంపేట నియోజకవర్గ పరిధిలోని అత్తిరాలలో ఉన్న శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి ఆలయం అన్నమయ్య, వైఎస్‌ఆర్ జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులతో నిండిపోయింది. భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. గుండ్లూరులోని అగస్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం మల్లయ్య కొండపై వెలసిన భ్రమరాంబికా సమేత మల్లిఖార్జున స్వామి ఆలయంలో మల్లయ్య స్వామి వేషధారణలతో వచ్చిన భక్తులు ఆకట్టుకున్నారు. అంగళ్లులోని మల్లయ్య కొండ ఆలయం దీపాల వెలుగుతో కనువిందు చేసింది. మదనపల్లి నియోజకవర్గంలోని తవళం నేల మల్లేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. మదనపల్లి పట్టణంలోని మణికయ్యల శివాలయం, కోడూరు పరిధిలోని భ్రమరాంబిక మల్లేశ్వర స్వామి ఆలయం, గుండాల కోన శివాలయం, పీలేరులోని శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం లాంటి ప్రధాన ఆలయాలతో పాటు మండల గ్రామీణ ప్రాంతాలలో వెలసిన శివాలయాలలో కార్తిక శోభ కన్నులపండుగగా విరాజిల్లింది. ఈ ఆలయాలలో భక్తులు కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment