దర్జాగా ఇసుక దందా
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి నేతలు అధికారమే అండగా.. దర్జాగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత ఇసుక విధానం వారికి వరంగా మారింది. ఇదే తడవుగా నాణ్యమైన ఇసుక లభించే నందలూరు మండలం చెయ్యేరు నదీని ఎంచుకున్నారు. రాత్రి, పగలు తేడా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు నిదర్శనం టంగుటూరు అధికారిక రీచ్ పరిధిలో సోమవారం అధికారుల దాడిలో.. జేసీబీలు, 11 ట్రాక్టర్లు పట్టుబడటమే. అయితే ఐదు ట్రాక్టర్లు, రెండు జేసీబీలను మాత్రమే నందలూరు పోలీసులకు అప్పగించారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విధంగా నిత్యం చెయ్యేరులో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది.
అధికార పార్టీ ఓ ప్రతినిధి కనుసన్నల్లో..
అధికార పార్టీకి చెందిన ఓ ప్రతినిధి కనుసన్నల్లో ఇసుక దందా కొనసాగుతోందని ఆ పార్టీ వర్గాలే బహిరంగంగా విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు సంబంధం లేదంటూనే , తమకు అనుకూలమైన ఓ మాజీ ఎంపీపీ, మరికొంతమంది అనుచరులు, రీచ్ వాటదారుల పర్యవేక్షణలో అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా అన్ని ఖర్చులు పోగా రోజుకు రూ.2 లక్షల ఆదాయం తమ ఖాతాలో వేసుకుంటున్నారు. దీంతో అధికార పార్టీలోనే మరి కొంత మంది నేతలు రంగంలోకి దిగారు. ఇసుక రీచ్ చెన్నయగారిపల్లెకు చెందిన ఓ కాపునేత పేరుతో తెరపైకి తీసుకొచ్చి, పలువురు స్థానిక నేతలు వాటాలతో రీచ్ నడిపిస్తున్నారు. చెయ్యేరు నదీ పరీవాహక ప్రాంతమైన అటూ ఓబలి, ఇటు టంగుటూరు, కోమంతరాజుపురం, నారాయణనెల్లూరు ఇసుకాసురుల రాజ్యంగా సాగుతోంది. చెయ్యేరులో ఇసుక అక్రమ దందాపై పోలీసులు, అధికారులకు ఆ పార్టీకి చెందిన వారే సమాచారం ఇచ్చి పట్టించడం కొసమెరుపు.
టంగుటూరు అంతా ఇసుక డంప్‌లు
రీచ్‌కు అత్యంత సమీపంలో ఉన్న టంగుటూరు అంతా ఇసుక అనధికారిక డంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇసుకాసుల సొంత డంపింగ్ యార్డులు కావడం గమనార్హం. అధికారికంగా ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోని టీవీపురం పంచాయతీ కార్యాలయం(నిర్మాణంలో) ఉన్న చోట డంపింగ్ యార్డును రాజంపేట సబ్‌కలెక్టర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్దేశించిన డంపింగ్ యార్డులో కాకుండా టంగుటూరు గ్రామంలోని ఖాళీ స్థలాల్లో డంపింగ్ చేసేశారు. అధికారిక డంప్‌లో మొక్కుబడిగా కొన్ని ట్రిప్పులు తోలి ఇసుక చూపిస్తున్నారు. టంగుటూరులో అన్నమయ్య బందీఖానా, షాదీఖానా, కై లాసఽనాఽథాలయం, వాల్మీకి ఆశ్రమం ఏరియాల్లో ఇసుక డంపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉచితంగా తీసుకెళ్లే వారికి అడ్డంకులు
చెయ్యేరులో నుంచి ఉచితంగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో తీసుకెళ్లే వారికి.. రీచ్ తమ్ముళ్ల ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నారు. పోలీసులు సవాలక్ష కారణాలతో యేటిలోకి రానివ్వకుండా చేస్తున్నారని సామాన్యులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానానికి ఆ పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారని ఎడ్లబండ్ల, ట్రాక్టర్ల యజమానులు వాపోతున్నారు.
చెయ్యేరును తోడేస్తున్న కూటమి నేతలు
టంగుటూరు కేంద్రంగా అక్రమ వ్యాపారం
సొంతంగా డంపింగ్ యార్డులు
Comments
Please login to add a commentAdd a comment