వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
మదనపల్లె : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. కలకడ మండలం ఎనుగొండపాలేనికి చెందిన దంపతులు మోహన(55), అంజనమ్మ(45)లు ద్విచక్రవాహనంలో వాల్మీకిపురానికి వచ్చి పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా, మార్గమధ్యంలోని టమాటా మార్కెట్ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డారు. ప్రమాదంలో మోహన తీవ్రంగా గాయపడగా, అంజనమ్మ స్వల్పంగా గాయపడింది. అదేవిధంగా మదనపల్లె మండలం సీటీఎం పంచాయతీ గంగాపురానికి చెందిన మల్లయ్య, లక్ష్మీదేవి(55) ద్విచక్రవాహనంలో వ్యక్తిగత పనులపై పంచాయతీ ఆఫీసుకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతుండగా, మార్గమధ్యంలోని గంగమ్మ గుడి సమీపంలో ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొంది. ప్రమాదంలో లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడింది. ఆయా ఘటనల్లో గమనించిన స్థానికులు బాధితులను 108 వాహనాల్లో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
రైతుకు తీవ్రగాయాలు
రామసముద్రం : బొలెరో వాహనం ఢీకొని రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన రామసముద్రం మండలంలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య కథనం మేరకు...రామసముద్రం మండలం నారేవారిపల్లెకు చెందిన రైతు రామచంద్ర(40) మంగళవారం ఉదయం ఊరికి సమీపంలోని తన వ్యవసాయ బోరు వద్దకు బైకులో వెళుతుండగా, మార్గమధ్యంలోని కాప్పల్లె వద్ద వేగంగా వస్తున్న బొలెరో వాహనం బైకును ఢీకొంది. సమాచారం అందుకున్న కుటుంబీకులు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రామచంద్రను చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో రైతును తిరుపతి రుయాకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
స్కూటరిస్టుకు గాయాలు
కేవీపల్లె : గుర్తు తెలియని వాహనం ఢీకొని స్కూటరిస్టుకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని గోరంట్లపల్లె పంచాయతీ అంబువారిపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. కేవీపల్లె మండలం నారమాకులపల్లెకు చెందిన నాగభూషణం (34) పీలేరు పట్టణంలోని ఓ దుకాణంలో పని చేసేవాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలోని అంబువారిపల్లె సమీపంలో ఎదురుగా వచ్చిని గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగభూషణంను చికిత్స నిమిత్తం 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ట్యాంక్ అంటుకుని..
మదనపల్లె : ద్విచ్రక్రవాహనం పెట్రోల్ ట్యాంకు మంటలతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం ములకలచెరువు మండలంలో జరిగింది. చౌడసముద్రానికి చెందిన టి.వెంకటరమణ (35) బైక్‌కు పెట్రోల్ కొట్టించి, లాక్ చేయడం మరచిపోయాడు. తర్వాత కొంతదూరం వచ్చాక ద్విచక్రవాహనాన్ని నిలిపి సిగరెట్ తాగేందుకు అగ్గిపుల్లను వెలిగించాడు. పెట్రోల్ ట్యాంక్ ఓపెన్‌లో ఉండటంతో ఒక్కసారిగా మంటలు రావడంతో వెంకటరమణ ఛాతీ పై తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు బాధితుడ్ని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బాధితుడ్ని తిరుపతికి రెఫర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment