ఆరోపణల అధికారికి అందలం
బి.కొత్తకోట : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ఉన్నతాధికారులు అందలం ఎక్కించారు. ఆరోపణలపై విచారణలు, అభియోగాల నమోదు వంటి చర్యలు మొదలైనప్పటికీ అధికారులు వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఏకంగా మూడు పదవులు కట్టబెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే.. బి.కొత్తకోట ఆలయాలకు గ్రేడ్–3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మునిరాజ విధులు నిర్వహిస్తుండగా పలు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన సర్వేనంబర్ 1726/1, 1840లోని భూమికి వేలంపాటలు నిర్వహించి లీజుకు అప్పగించారు. ఈ భూమిలో ఇసుక నిల్వలు ఉండగా భారీస్థాయిలో తరలిపోయింది. దీనితో లీజు భూమి ఎక్కడుందో కనిపించని పరిస్థితి నెలకొంది. దీనిపై అందిన ఫిర్యాదుతో దేవదాయ ధర్మాదాయశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో మునిరాజ ఆలయ భూముల పరిరక్షణలో విఫలమైనట్టు గుర్తించారు. భూమిలోని ఇసుక తరలిపోకుండా అడ్డుకోవడంలో, భూమిని కాపాడడంలో విఫలమైనట్టు నిర్ధారించారు. ఇసుక తరలిపోతున్నా పట్టించుకోకపోగా పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించడం, తదితర కారణాలతో కమిషనర్ అభియోగాలను నమోదు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి ముందు చార్జ్ మెమోలను కూడా జారీ చేసి సంజాయిషీ కోరారు. ఇలా ఉండగా స్థానిక బీరంగిరోడ్డులోని గంగమ్మ ఆలయ మాన్యం భూమిలో 13 వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వీటి యజమానుల నుంచి రూ.16 లక్షల అద్దె వసూలు చేసినట్టు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ అద్దెకు సంబంధించి రశీదులు చెల్లించలేదని చెల్లింపుదారులు చెబుతుండగా ఇటీవల జిల్లా అధికారి విశ్వనాఽథ్ విచారణ జరిపారు. మునిరాజతో కలిపి అద్దెదారులతో విచారించారు. ఈవిచారణలో తేలిన అంశాలతో విశ్వనాఽథ్ నివేదికను డెప్యూటీ కమిషనర్‌కు పంపారు. మునిరాజకు రూ.16 లక్షలు చెల్లించామని అద్దెదారులు చెబుతుంటే..తనకు చెల్లించింది రూ.1,30,400 మాత్రమే అని ఈఓ విచారణలో వెల్లడించారు. అద్దెదారులు ఎంత చెల్లించి ఉంటే అంతే మొత్తానికి రసీదులు ఇచ్చామని ఈఓ పేర్కొన్నారు. అయితే పూర్తి విచారణలో ఏమి తేలిందో వెలుగులోకి రాలేదు. అయితే నివేదిక డీసీకి చేరింది. చెన్నకేశవస్వామి మాన్యం భూమి ఇసుక తరలిపోవడం, అద్దె వసూళ్ల ఆరోపణలపై దేవాదాయశాఖ కమిషనర్ చర్యలు తీసుకొవాల్సి ఉంది.
మూడు పోస్టులు ఇచ్చేశారు..
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి విషయంలో ఉన్నతాధికారులు అండగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన బదిలీల్లో తంబళ్లపల్లె నియోజకవర్గంలో అత్యంత ప్రముఖ ఆలయం మల్లయ్యకొండపై వెలసిన మల్లికార్జునస్వామి ఆలయానికి ఈఓగా బదిలీ చేశారు. అంతటితో సరిపెట్టకపోగా బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు మండలాలకు చెందిన గ్రూప్ టెంపుల్స్ ఈఓగా, చిత్తూరుజిల్లా మొగిలి ఆలయాలకు ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
కమిషనర్ వద్ద పెండింగ్
మునిరాజపై చర్యలు తీసుకునే ఫైల్ కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉందని జిల్లా అధికారి విశ్వనాఽథ్ చెప్పారు. ఇప్పటికే అతనిపై ఆభియోగాలు నమోదయ్యాయని చెప్పారు. అధికారుల కొరత, కొందరు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించినా సుముఖత లేకపోవడంతో మునిరాజకు అప్పగించడం జరిగిందని చెప్పారు. ఈ విషయమై ఈఓ మునిరాజ మాట్లాడుతూ ఇసుక తరలింపులో తన ప్రమేయం లేదన్నారు. రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు.
బి.కొత్తకోటలో ఆలయ భూమి రక్షణలో విఫలమైన ఈఓ మునిరాజపై అభియోగాల నమోదు, చార్జ్ మెమోలు
ఇప్పుడు తంబళ్లపల్లె ఈఓగా ప్రమోషన్ ఇచ్చి బి.కొత్తకోట, మొగలి ఆలయాల అదనపు బాధ్యతలు
Comments
Please login to add a commentAdd a comment