కేవీపల్లె : మండలంలోని మఠంపల్లె పంచాయతీ పరిధిలో కోడిపందెం ఆడుతున్న 13 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 27,250 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. తమకు అందిన సమాచారంతో దాడి నిర్వహించామన్నారు.
అదుపు తప్పి లారీ బోల్తా
పీలేరు రూరల్ : అదుపు తప్పి లారీ బోల్తా పడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన ఘటన బుధవారం మండలంలోని కావలిపల్లె పంచాయతీలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అమరరాజా బ్యాటరీల లోడుతో చిత్తూరు నుంచి లక్నోకు వెళుతున్న లారీ కావలిపల్లె పంచాయతీ పరిధిలో పీలేరు – సుండుపల్లె రోడ్డు వంక వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురేంద్ర (42) తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
15 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ఒంటిమిట్ట : మండలంలోని గొల్లపల్లి ఇసుక క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 15 ట్రాక్టర్లను ఒంటిమిట్ట రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఒంటిమిట్ట తహసీల్దార్ రమణమ్మ తెలిపిన వివరాల మేరకు తమకు వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో మండల పరిధిలోని గొల్లపల్లి ఇసుక క్వారీలో ఎలాంటి రశీదులు లేకుండా ఇసుకను లోడ్ చేసుకొని రవాణాకు సిద్ధంగా ఉన్న కడపకు చెందిన15 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10 వేలు జరిమానా విధించినట్లు ఆమె తెలిపారు.
ఎంఈఓ సస్పెన్షన్‌పై విచారణ
ఓబులవారిపల్లె : గతంలో ఓబులవారిపల్లె ఎంఈఓగా పనిచేసిన పద్మజ సస్పెన్షన్‌పై బుధవారం నంద్యాల డిప్యూటీ డీఈఓ మహ్మద్ బేగ్ విచారణ చేపట్టారు. పాఠ్యపుస్తకాలు, విద్యాసామగ్రి అవకతవకలపై గతంలో ఎంఈఓ పద్మజను సస్పెండ్ చేశారు. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని విచారణ జరపాలని కోరడంతో ఉన్నతాధికారులు డిప్యూటీ డీఈఓ మహమ్మద్ బేగ్‌ను విచారణకు పంపించారు. మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను స్థానిక ఎంఆర్‌సీ కార్యాలయంలో విచారించారు. విచారణ కోరిన ఎంఈఓను పక్కన కూర్చోబెట్టుకుని విచారణ చేయడం పట్ల పలువురు ప్రధానోపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు. విచారణ విషయాలను బయటకు వెల్లడించకుండా అధికారులు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment