హంద్రీ నీవా భూమిని అమ్మేశారు.!
కురబలకోట : భూ అక్రమార్కులు మండలంలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ఏమాత్రం ప్రభుత్వ భూమి కన్పించినా అప్పనంగా కొట్టేశారు. ప్లాట్లు విభజించి అమ్మి సొమ్ము చేసుకున్నారు. మండలంలోని అంగళ్లు వద్ద హంద్రీనీవా పంప్ హౌస్ పక్కన హంద్రీనీవా కాలువకు సంబంధించి సర్వే నంబరు 220/2బీలో ఎకరా 60 సెంట్లు భూమి ఖాళీగా ఉండేది. రియల్టర్ల కన్ను పడింది. ఏకంగా ప్లాట్లు చేసి అమ్మేశారంటే వారెంత ఘనులో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు హెచ్‌ఎన్‌ఎస్ అధికారులు ఎంత నిర్లిప్తంగా ఉన్నారో చెప్పకనే చెబుతోంది. చివరకు ఆలస్యంగా మేల్కొని రెవెన్యూకు ఇటీవల ఫిర్యాదు చేయడంతో బండారం కాస్తా బయటపడింది. సర్వే నిర్వహించి హంద్రీనీవా భూమిగా రెవెన్యూ నిగ్గు తేల్చింది. దీని విలువ ఇప్పుడు రూ. 5 కోట్లు దాకా ఉంది. రెవెన్యూ అధికారులు హెచ్‌ఎన్‌ఎస్ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బుధవారం ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని ఆక్రమిస్తే శిక్ష తప్పదని హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. హంద్రీ నీవా కాలువకు సంబంధించిన ఈ భూమిలో ఎవ్వరూ ప్రవేశించరాదని తహశీల్దారు తపస్విని తేల్చి చెప్పారు. అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో అక్రమార్కుల నుండి ఈ ప్లాట్లను కొన్నవారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్లాటు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా విక్రయించారు. నమ్మి కొన్న బాధితుల గోడు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. భూ కబ్జా చేసి అమ్మి సొమ్ము చేసుకున్న అక్రమార్కుల కోసం బాధితులు తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా మండలంలో ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించి ఉన్నా, అమ్మి సొమ్ము చేసుకుని ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తహశీల్దారు తపస్విని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఆలస్యంగా మేల్కొన్న హెచ్‌ఎన్‌ఎస్
అధికారులు
పక్కాగా లెక్క తేల్చిన రెవెన్యూ
రూ.5 కోట్లు విలువైన భూమి తిరిగి స్వాధీనం
హెచ్చరిక బోర్డు ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment