జిల్లా స్థాయి త్రోబాల్ క్రీడాకారుల ఎంపిక
ఓబులవారిపల్లె : ఎస్‌జీఎఫ్ వైఎస్సార్ కడప జిల్లా త్రోబాల్ అండర్–17, 14 బాల బాలికల జిల్లాస్థాయి ఎంపికలను శుక్రవారం ముక్కావారిపల్లె ఆర్‌ఎస్ గురుకుల పాఠశాలలో నిర్వహించారు. 200 మంది క్రీడాకారులు, 25 మంది వ్యాయామ ఉపాధ్యాయులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌జీఎఫ్ వైఎస్సార్ కడప జిల్లా సెక్రటరీ అరుణ కుమారి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో త్రోబాల్ పోటీలకు అండర్–14, 17 బాలురు బాలికల క్రీడాకారులకు సంబంధించి 200 మంది పాల్గొనగా 24 మంది బాలురు, 24 మంది బాలికలు చొప్పున మొత్తం 48 మంది ఎంపికై నట్లు తెలిపారు. అండర్ 14 చిత్తూరు జిల్లాలో, అండర్–17 గుంటూరు జిల్లాలో నిర్వహించే పోటీలలో పాల్గొంటారని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ అసిస్టెంట్ సెక్రటరీ టి ఆంజనేయరాజు, ప్రిన్సిపాల్ ఏపీఆర్‌ఎస్ బి ఆంజనేయరాజు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్ భాస్కర్, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
26న బాలరంగ్ జానపద నృత్యపోటీలు
రాయచోటి టౌన్ : ఈనెల 26వ తేదీన రాయచోటి డైట్ కళాశాల ఆవరణంలో బాలరంగ్ జిల్లా స్థాయి జానపద నృత్యపోటీలు నిర్వహంచనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ , రాష్ట్ర విద్యాశాఖ సంయ్తుంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జానపద కళాకారులు తప్పెటగూళ్లు, కర్రసాము, చెంచుల వేట, తింస, జాలరి, బంజారా వంటి జానపద నృత్యాలను ప్రదర్శించవచ్చున్నారు. నృత్య, గాత్ర, వాయిద్యనైపుణ్యగల విద్యార్థులు ఒక సమూహంగా ఏర్పడి 15 మందికి మించకుండా ప్రదర్శన ఇవ్వాలన్నారు. జిల్లా జట్టు తమ ప్రాంతంలోని సంప్రదాయ జానపదాలను ప్రదర్శించాలని సూచించారు. గత బాలరంగ్‌లో పాల్గొన్న జట్లు అనర్హలని తెలిపారు. విద్యార్థులు తప్పకుండా గుర్తింపు కార్డు పొంది ఉండాలని చెప్పారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఒక జట్టు మాత్రమే ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థుల వివరాలు డైట్ కళాశాల అధ్యాపకుడు అసదుల్లా బాషా మొబైల్ 9440084715 నంబర్‌కు వాట్సాప్‌కు పంపాలని సూచించారు.
రైతు సమస్యల పరిష్కరానికి కృషి చేయాలి
– సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్
పెద్దమండ్యం : భూ సమస్యలతో కార్యాలయానికి వచ్చే రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అన్నారు. మండలంలోని శివపురం, పెద్దమండ్యం గ్రామాలలో శుక్రవారం ఆయన పర్యటించారు. శివపురంలో రీసర్వే జరిగిన భూముల్లో ఉన్న సర్వే రాళ్లను పరిశీలించారు. శివపురం, శిద్దవరం గ్రామాలలో జరిగిన రీసర్వేపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రికార్డులను పరిశీలించారు. ఫ్రీ హోల్డ్ భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయం వద్ద పలువురు రైతులు వారి సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అర్జీలను పరిశీలించిన సబ్ కలెక్టర్ రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పెద్దమండ్యం గ్రామం రెడ్డివారిపల్లె దళితవాడ వద్ద , దళితులు వేసుకున్న గొర్రెలు, మేకల దొడ్లపై రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాటిని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సయ్యద్ అహ్మద్, వీఆర్‌వో, సర్వేయర్‌లు పాల్గొన్నారు.
టౌన్‌బ్యాంక్ పాలకవర్గానికి 12 నామినేషన్లు
మదనపల్లె : ది మదనపల్లె కో–ఆపరేటివ్ టౌన్‌బ్యాంక్ లిమిటెడ్ పాలకవర్గ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. పాలకవర్గానికి ఎన్నుకోవాల్సిన సభ్యుల సంఖ్య 12 కాగా, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణలో 12 మంది సభ్యులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో టౌన్‌బ్యాంక్ పాలకవర్గ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక లాంచనం కానుంది. టౌన్‌బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల అధికారి బి.దుర్గమ్మ ఆధ్వర్యంలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగింది. బ్యాంక్‌లోని 12 డైరెక్టర్ల స్థానాలకు నిమ్మనపల్లె ముక్తియార్‌ఖాన్, సూరె రవీంద్రనాథ్, సవరం భాస్కర్‌కుమార్, నాదెళ్ల విద్యాసాగర్, రాటకొండ సి.సోమశేఖర్, దిగువపాళ్యం నిరంజన్‌కుమార్, నాదెళ్ల వెంకటేశ్వరప్రసాద్, శ్రీరామ రవికాంత్‌బాబు, రామిశెట్టి భాస్కర్, ఆకులకృష్ణమూర్తి, పఠాన్ సర్దార్‌ఖాన్, జోలిపాళ్యం కృష్ణమూర్తి దేవేంద్రబాబులు నామినేషన్లు దాఖలు చేశారు. 12 స్థానాలకు కేవలం సింగిల్ నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి బి.దుర్గమ్మ మాట్లాడుతూ..టౌన్‌బ్యాంక్ పాలకవర్గ సభ్యుల ఎన్నికకు సంబంధించి 12 నామినేషన్లు వచ్చాయన్నారు. శనివారం నామినేషన్ల స్క్రూటినీ చేస్తామన్నారు. 24న నామినేషన్ల ఉపసంహరణ, 25న ఆఫీస్ బేరర్ల ఎన్నిక జరుగుతుందన్నారు. అయితే ముందునుంచి అందరూ ఊహించినట్లుగానే టౌన్‌బ్యాంక్ పాలకవర్గ ఎన్నికల్లో ఇతరులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకుండా కూటమి నాయకులు పకడ్బందీ వ్యూహంతో వ్యవహరించారు. స్క్రూటినీ, ఉపసంహరణల ప్రక్రియ అనంతరం టౌన్‌బ్యాంక్ చైర్మన్‌గా నాదెళ్ల విద్యాసాగర్ ఎన్నిక దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది.
ఏఆర్ డీఎస్పీగా శ్రీనివాసులు
రాయచోటి : అన్నమయ్య జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయం ఏఆర్‌డీ ఎస్పీగా ఎం శ్రీనివాసులను నియమి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. శుక్రవారం రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏఆర్ డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాయచోటి పోలీస్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఏఆర్ డీఎస్పీ చిన్నకృష్ణ చిత్తూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి బదిలీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment