తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి
ఓబులవారిపల్లె : తొలగించిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఏపీఎండీసీ కార్యాలయంలో ఈ విషయంపై సీపీఓ సుదర్శన్ రెడ్డితో వారు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హయాంలో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇప్పుడు మూకుమ్మడిగా అందరినీ ఒకేసారి తొలగించడం అన్యాయమన్నారు. తొలగించిన వారికి మళ్లీ ఉద్యోగాలు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి కూటమి ప్రభుత్వం పాపం మూటగట్టుకుందన్నారు. స్థానికంగా ఇల్లు, భూములు కోల్పోయిన వారు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారన్నారు. ఇది వారి హక్కు అన్నారు. ఎవరో చెప్పారని పనిచేస్తున్న ఉద్యోగులను ఎలా తొలగిస్తారని సీపీఓను ఆయన ప్రశ్నించారు. మంగంపేటను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు రూ. 400 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందని, మూడు గ్రామాలు తరలించడమే కాక అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పునరావాసం కల్పించారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో వందలాది మిల్లులు ఏర్పాటు చేసి వేలాది మందికి జీవనోపాధి కల్పించారన్న విషయం గుర్తు చేశారు. యువగళంతో ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి నారాలోకేష్ హామీ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వకపోగా పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి వారి కుటుంబాలను రోడ్డున పడవేశారని విమర్శించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పునరావాస కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించారని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పటికీ రాజంపేట ఎంపీగా ఉన్నారని కనీసం ఆయనకు తెలియకుండా ఉద్యోగాలను ఎలా తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైల్వేకోడూరు వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, మాజీ డీఆర్‌యూసీసీ మెంబర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి, పుల్లంపేట వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ముస్తాక్, నాయకులు శివారెడ్డి, ఆర్‌వీ రమణ, గల్లా శ్రీనివాసులు, దాము, రఘు, తొలగించిన ఉద్యోగులు, వైఎస్సార్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు
ఆకేపాటి, అధికార ప్రతినిధి కొరముట్ల
Comments
Please login to add a commentAdd a comment