సాహితీ వనంలో.. ఉర్దూ సుగంధం
కవి సమ్మేళనం
జయప్రదం చేయండి
మదనపల్లె సిటీ: మదనపల్లె పట్టణం బెంగళూరు బస్టాండులోని బడేమకాన్ దర్గా ఆవరణలో శనివారం రాత్రి అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ముషాయిరా కమిటీ కన్వీనర్ పఠాన్ మహమ్మద్‌ఖాన్, కార్యదర్శి ఖమర్ అమీని తెలిపారు. శుక్రవారం దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కవి సమ్మేళనానికి ఎమ్మెల్యే షాజహాన్‌బాషా హాజరుకానున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి ఉర్దూ కవులు కార్యక్రమంలో పాల్గొని మహా ప్రవక్త హజరత్ మహమ్మద్ జీవితంపై నాత్ ఏ షరీఫ్ పఠిస్తారని తెలిపారు. కార్యక్రమానికి ఉర్దూ భాషాభిమానులు, సాహితీప్రియులు హాజరుకావాలని కోరారు.
మదనపల్లె సిటీ: కవులు, సాహిత్యపరంగా ఖ్యాతి గాంచిన అన్నమయ్య జిల్లాలో తెలుగుతో పాటు ఉర్దూ సాహిత్యమూ పరిమళిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి దాటి ప్రపంచ స్థాయిలో సాహితీ వెలుగులు పంచుతోంది. కవి సమ్మేళనాలు, సాహితీ సదస్సులు, కవితలు, పాటలు, వ్యాసాలు, నాటకాలు ఇలా పలు అంశాలలో జిల్లాకు చెందిన రచయితలు, కవులు, సాహితీవేత్తలు తమ సాహిత్యప్రతిభను చాటుతున్నారు. నేడు (శనివారం) మదనపల్లెలో జాతీయ స్థాయి ఉర్దూ కవి సమ్మేళనం నిర్వహిస్తున్న సందర్భంగా జాతీయ స్థాయిలో ఉర్దూ సాహిత్యానికి ఆయువుపట్టుగా నిలుస్తున్న జిల్లాలోని పలువురు కవులు, సాహితీవేత్తల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం.....
బాబా ఫకృద్దీన్..
మదనపల్లె పట్టణం దేవళంవీధికి చెందిన అత్యంత సాదాసీదాగా కనిపించే బాబా ఫకృద్దీన్ (ఖమర్ అమీనీ) పరిచయం అవసరం లేని ప్రసిద్ధ ఉర్దూ కవి. రాయలసీమలో ఉర్దూ కవి సమ్మేళనాల నిర్వహణలో ఈయన పాత్ర మరువలేనిది. ఈయనకు ఉర్దూ కవిత్వంలో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. 40 సంవత్సరాల పాటు హిందీ, ఉర్దూ ఉపాధ్యాయునిగా పని చేసి పదవీ విరమణ చెందిన ఈయన జాతీయస్థాయిలో వేలాది ఉర్దూ కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఉర్దూలో ఈయన రచించిన తవాఫ్–ఏ–గజల్, నాత్‌కీ అంజుమన్, కష్కోల్–ఏ–ఖల్బ్–ఓ–నజర్, కష్కోల్–ఏ–కరమ్, ఇర్తికాజ్–ఏ–అఫ్కార్ కవితా సంపుటాలు జాతీయస్థాయిలో పలువురి మన్ననలు పొందాయి. రాష్ట్ర ఉర్దూ అకాడమీతో పాటు పలు సంస్థల ద్వారా ఈయన అనేక పురస్కారాలు అందుకున్నారు. ఈయన పలు కవితలు, విమర్శనాత్మక వ్యాసాలు, గజల్స్ రాశారు. ఆయన సాహిత్యంపై పలువురు విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు.
పఠాన్ మహమ్మద్‌ఖాన్..
పఠాన్ మహమ్మద్‌ఖాన్ కలం పేరు జోహర్. మదనపల్లె పట్టణానికి చెందిన ఈయన వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. పాఠశాల దశ నుంచే ఉర్దూ భాషపై మక్కువ పెంచుకున్న ఈయన నిరంతరం ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఉర్దూ సాహిత్యంలో పలు గజల్స్, హమ్ద్, నాత్‌లు రాశారు. ఉర్దూ కవి సమ్మేళనాలకు కన్వీనర్‌గా, రూటా రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. జిల్లాలో ఉర్దూ పాఠశాలల స్థాపన, ఉన్నతీకరణకు అటు ప్రభుత్వం ఇటు అధికారులతో ప్రాతినిధ్యం చేసి భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్‌లో ఉర్దూ అకడమిక్ మానటరింగ్ అధికారిగా పని చేస్తూ ఉర్దూ విభాగంలో సేవలను అందించారు. ఉర్దూ సాహిత్యాభివృద్ధి, భాషాభివృద్ధికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ అకాడమీ ద్వారా ఈయనను గత ఏడాది లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది.
షేక్ జాఫరుద్దీన్ ..
లక్కిరెడ్డిపల్లె మండలం నీలకంఠరావుపేటకు చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు జాఫరుద్దీన్ ప్రముఖ ఉర్దూ కవి. కలం పేరు జాఫర్. గత పది సంవత్సరాలుగా ఉర్దూ కవిగా, గాయకుడిగా వందల సంఖ్యలో కార్యక్రమాల్లో పాల్గొని ఉర్దూ భాషకు ఎనలేని సేవలు అందించారు. ఇటీవల ఉర్దూ అకాడమీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించింది. అజాద్ ఎడ్యుకేషనల్, మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ స్థాపించి ఉర్దూ భాషాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు.
సబాతుర్ రహమాన్ ..
రాయచోటికి చెందిన సబాతుర్ రహమాన్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. ఈయన రాయచోటి పట్టణంలోని మార్కెట్‌వీధిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. రూటా ఉర్దూ ఉపాధ్యాయ సంఘానికి జిల్లా అధ్యక్షునిగా కూడా ఉంటూ ఉర్దూ భాషలో సబాత్ కలం పేరుతో అనేక గజల్స్, నాత్, హమ్ద్‌లు రాశారు. ఉర్దూ భాషకు ఎనలేని సేవలు అందించారు.
డాక్టర్ నఖీవుల్లాఖాన్ ..
గుర్రంకొండకు చెందిన డాక్టర్ నఖీవుల్లాఖాన్ యువ ఉర్దూ కవిగా పేరు తెచ్చుకున్నారు. నఖీ ఆయన కలం పేరు. పలు కథలు, గజల్స్, నాత్, హమ్ద్‌లు రాశారు. ముఖ్యంగా ఉర్దూలో సాహిత్య అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. జాతీయస్థాయిలో అనేక ఉర్దూ కవి సమ్మేళనాల్లో పాల్గొని పలు ప్రశంసలు పొందారు. ఉర్దూ సాహిత్యంలో ఈయన చేసిన సేవలు, పరిశోధనలకుగాను శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం నుంచి పీహెచ్‌డీ అందుకున్నారు. అలాగే ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఉర్దూ అకాడమీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుతో సత్కరించింది.
తఖీవుల్లాఖాన్..
గుర్రంకొండకు చెందిన తఖీవుల్లాఖాన్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తఖీ కలం పేరుతో ఉర్దూలో అనేక గజల్స్, నాత్, కవితలు రాశారు. జాతీయ స్థాయిలో అనేక ఉర్దూ కవి సమ్మేళనాల్లో పాల్గొని కవితాగానం చేసి గుర్తింపు పొందారు. ఉర్దూ సెమినార్లు, సదస్సులలో పాల్గొని అనేక ప్రశంశలు పొందారు.
రియాజుద్దీన్ హుస్సేని..
రాయచోటికి చెందిన రియాజుద్దీన్ హుస్సేని ప్రముఖ ఉర్దూ కవి. రజీ కలం పేరు. బజ్మే హుస్సేని సంస్థను స్థాపించి వందల సంఖ్యలో ఉర్దూ కవి సమ్మేళనాలు నిర్వహించారు. ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అనేక గజల్స్, నాత్, హమ్ద్‌లు రాశారు. ఉర్దూ భాషకు సేవలు అందిస్తున్నారు.
షీన్‌మీమ్ హాషిం ..
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటికి చెందిన షీన్‌మీమ్ హాషిం వృత్తిరీత్యా ఉ ర్దూ ఉపాధ్యాయుడు. తలీఖ్ కలం పేరుతో అనేక ఉర్దూ హమ్ద్, నాత్, గజల్స్ రాశారు. జాతీయ స్థాయిలో జరిగే ఉర్దూ కవి సమ్మేళనాలలో వ్యాఖ్యాతగా పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. రా ష్ట్ర స్థాయిలో అనేక పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉర్దూ పండితుడిగా పని చేస్తున్నారు.
ఇమామ్ ఖాసీం..
ఇమామ్ ఖాసీం కలం పేరు సాఖి. లక్కిరెడ్డిపల్లెలో ఇంగ్లీషు టీచర్‌గా పని చేస్తున్నారు. ఆయన వందలాది హమ్ద్, నాత్, గజల్స్ రాశారు. ఇప్పటి వరకు ఆయన రాసిన అబ్షార్–ఏ–సఖున్, ఫిక్ర్–ఓ–ఫన్–కే పూల్ ఉర్దూదోహే కవితా సంపుటాలు దేశ వ్యాప్తంగా మన్ననలు పొందాయి. ఉర్దూ కవిత్వం, సాహిత్యాభివృద్ధి కోసం ప్రతి నెలా బజ్మ్–ఏ–సాఖియేఖున్ పేరుతో రాయచోటిలో కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
నేడు మదనపల్లెలో అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనం
Comments
Please login to add a commentAdd a comment