సురక్షిత విధానాలతో ప్రమాదాల నివారణ
కడప కార్పొరేషన్ : విద్యుత్ ప్రమాదాల నివారణకు సురక్షిత విధానాలు అనుసరించాలని ఏపీఎస్‌పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్.రమణ అన్నారు. భారత ప్రభుత్వ అధికార మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ వారు ‘కార్యాచరణ భద్రత, విపత్తు నిర్వహణ’పై విద్యుత్ సిబ్బందికి రెండు రోజులుగా శిక్షణ ఇస్తున్నారు. మంగళవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఎదుర్కోవడానికి తక్షణమే స్పందించి చర్యలు తీసుకునేలా సిబ్బంది సామర్థ్యాలను పెంపొందించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమన్నారు. విద్యుత్ భద్రత విధానాలు, ప్రమాద నివారణ పద్ధతులు, అగ్ని ప్రమాదాలపై లోతైన అవగాహన అవసరమని పేర్కొన్నారు. అధిక శాతం ప్రమాదాలు విపత్తుల వల్ల సంభవిస్తున్నాయని, బాధితులకు సాయం చేయడానికి ప్రథమ చికిత్స పద్ధతులు తెలుసుకోవాలన్నారు. వరదలు, తుపానులు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సంసిద్ధత గురించి శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ దుర్గాప్రసాద్, యన్‌పీటీఐ డైరెక్టర్ కె.ముత్తుకుమార్, డీఈఈ క్రిష్ణదేవ, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment