బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వైఎస్‌ఆర్, అన్
సాక్షి కడప/సాక్షి రాయచోటి: తుఫానులు భయపెడుతున్నాయి. ఇదేంటి తుంపర వర్షమే కదా అనుకుంటున్నారా... నిజమే వరుణ దేవుడు కురిపించే తుంపరే టెన్షన్ పెడుతోంది. అందుకు కారణాలు లేకపోలేదు. ఒకటి కాదు, రెండు కాదు.. రెండు, మూడు నెలల వ్యవధిలోనే నాలుగైదు తుఫాన్లు రావడంతో పంటలు వేసిన రైతులతోపాటు వ్యాపారులు కూడా అమ్మో తుఫాను అంటూ హడలిపోతున్నారు. అందులోనూ శీతాకాలం సీజన్ కావడంతో తుఫాను ధాటికి చలి విపరీతంగా పెరిగి రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో వాతావరణం మంచు దుప్పటిలా కప్పుకుంటోంది. చలి పెరగడం...వ్యాధులు పంజా విసురుతుండడం...పారిశుద్ధ్యం అధ్వానంగా మారడంతో జన జీవనం కూడా స్తంభించిపోతోంది.
చిరు వ్యాపారుల్లో అలజడి
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయగానే చిరు వ్యాపారుల గుండెల్లో అలజడి మొదలైంది. సాధారణ వర్షమైతే అప్పటికప్పుడు లేదా ఒకరోజుతో తెరిపి లభిస్తుంది. కానీ, తుఫాను అయితే మూడు, నాలుగు రోజులపాటు తీవ్రత ఉండడంతో వ్యాపారాలు కూడా పూర్తి స్థాయిలో పడిపోతున్నాయి. అసలు చిన్నచిన్న షాపులకు వ్యాపారాలు లేక లబోదిబోమంటున్నారు. రోడ్డు వారగా విక్రయించే పండ్ల వ్యాపారులు, డ్రై ఫ్రూట్స్, దోసెలు, బజ్జీలు, టీకొట్లు, చిరుతిండ్ల బండ్లు ఇంటికే పరిమితం అవుతున్నాయి. అందుకే తుఫాను అనగానే ముందుగా వారి గుండెల్లోనే రైళ్లు పరిగెడుతున్నాయి.
జనజీవనం అస్తవ్యస్తం
ఇటీవల కురిసిన వర్షాలకు రైల్వేకోడూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు పోటెత్తాయి. రిజర్వాయర్లకు కూడా నీటి ప్రవాహం పెరగడంతో దిగువకు వదిలారు. ప్రధానంగా రోడ్లు కొట్టుకుపోవడం, వాగులు, వంకల్లో నీటి ప్రవాహం పెరగడంతో పల్లెల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా ప్రధాన రహదారులపై జనాలు కనిపించడం లేదు. చాలా వరకు ప్రయాణాలు సైతం వాయిదా వేసుకుని ఇళ్లకే పరిమితం అవుతున్నాయి. ద్విచక్ర వాహనదారులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఏది ఏమైనా ఇలా అనేక వర్గాలను తుఫాను టెన్షన్ వెంటాడుతోంది.
పడకేస్తున్న పారిశుద్ధ్యం
వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో వర్షంతోపాటు తుఫాను ప్రభావంతో పారిశుద్ధ్యం పడకేస్తోంది. తుఫాను ప్రభావం నెలకొన్న ప్రతిసారి రెండు, మూడు రోజులపాటు ఏకధాటి వర్షాలు కురుస్తుండడంతో గ్రామాలతోపాటు పట్టణాల్లోనూ పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోంది. వీఐపీల పర్యటన సమయంలోనే బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు తప్ప మిగతా సమయాల్లో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం గురించి పట్టించుకోవడం లేదు.
అన్నదాతల్లోనూ ఆందోళన
తుఫాను వచ్చిందంటే ప్రధానంగా అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. సాగులో ఉన్న పంటలకు ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువగా మిగుల్చుతున్నాయి. ఇటీవలి తుఫానులో కురిసిన వర్షాలతో అటు వైఎస్సార్, ఇటు అన్నమయ్య జిల్లాల్లోని రైల్వేకోడూరు, రాజంపేట, తంబళ్లపల్లె, మదనపల్లె, మైదుకూరు, ఖాజీపేట, చాపాడు, చెన్నూరు ఇలా అనేక ప్రాంతాల్లో పండ్ల తోటలతోపాటు వరికి దెబ్బతగిలింది. నోటికాడికి వచ్చిన వరి పంట పొలాల్లోనే నేల వాలిన పరిస్థితి. ఇప్పుడు కూడా వరి పంట కోత దశలో ఉంది. కానీ తుఫాను అనగానే ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న ఆందోళన అన్నదాతలను వెంటాడుతోంది.
వరుస తుఫానులతో బెంబేలెత్తుతున్న జనం
ఇటీవలి వర్షాలకు వరి పంటపై తీవ్ర ప్రభావం
చిరు వ్యాపారుల జీవనానికి దెబ్బ
మరోవైపు ముసురుకుంటున్న వ్యాధులు
ఐదు నెలల్లో వచ్చిన తుఫాన్లు: 06 వైఎస్సార్‌జిల్లా వ్యాప్తంగా సాగైన
మినుము: 12,540 హెక్టార్లు
బుడ్డశనగ: 72,776 హెక్టార్లు
అన్నమయ్య జిల్లా...
కోత దశలో ఉన్న వరి: 1300 ఎకరాలు
సాగైన మినుము: 9253 హెక్టార్లు
Comments
Please login to add a commentAdd a comment