ఇద్దరిపై దాడి
కురబలకోట : రాత్రి వేళ ఇంటి పక్కన ఉన్నారన్న అనుమానంపై ఇద్దరిపై ఓ కుటుంబ సభ్యులు విచక్షణా రహితంగా కొడవలి, రాడ్లతో దాడి చేశారు. ముదివేడు పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె అమ్మచెరువు మిట్ట కాలనీలో రాజు అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతని ఇంటికి సమీపంలోని ఏసీ గోడౌన్ వద్ద పని చేసే శ్రీనివాసులు (30), అతని బావమరిది బసినికొండకు చెందిన గుణ శేఖర్ (21)తోపాటు కొందరు.. రాజు ఇంటి సమీపంలో రాత్రి వేళ మాట్లాడుకోసాగారు. అనుమానించిన రాజు అతని కుటుంబ సభ్యులు వారిపై కొడవలి, రాడ్లతో దాడి చేశారు. బాధితులను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అరటి, టెంకాయ చెట్ల నరికివేత
చిన్నమండెం : మండలంలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన రవీంద్రారెడ్డి తోటలో టెంకాయ, అరటి చెట్లను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. రవీంద్రారెడ్డికి 2 ఎకరాల పొలం ఉంది. అందులో టెంకాయ, అరటి చెట్లను పెంచుతున్నాడు. మూడు టెంకాయ, మూడు అరటి చెట్లను నరికివేశారని బాధితుడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
ఆటో, బైక్ ఢీకొని
యువకుడి మృతి
గాలివీడు : మండలంలోని గాలివీడు కొనంపేట ప్రధాన రహదారిపై ఆటో, బైక్ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. లక్కిరెడ్డిపల్లి మండలం పందెళ్లపల్లి గ్రామం దళితవాడకు చెందిన కోట్లపల్లి వెంకటరమణ, నారాయణమ్మ దంపతుల కుమారుడు పవన్‌కుమార్(18) గాలివీడు పంచాయతీ దళితవాడలోని తన సోదరి ఇంటికి వచ్చాడు. తిరుగు ప్రయణంలో బైక్‌పై వెళ్తుండగా.. నూలివీడు బక్కిరెడ్డిగారిపల్లె సమీపంలో లక్కిరెడ్డిపల్లి నుంచి గాలివీడుకు వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో పవన్‌కుమార్ తలకు బలమైన గాయమై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అదే మార్గంలో వెళ్తున్న డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ కొండారెడ్డి, ఎస్‌ఐ రామకృష్ణ బాధితుడిని తమ వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పెట్రోలు బంకు సిబ్బందిపై దాడి
అట్లూరు : పెట్రోలు బంకు సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. అట్లూరు క్రాస్ రోడ్డుకు చెందిన దేవర బాలకృష్ణతోపాటు మరో ముగ్గురు రెడ్డిపల్లి దగ్గర ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌కు వెళ్లి బాటిళ్లకు పెట్రోలు అప్పుగా పట్టాలన్నారు. బంకులో పని చేసే సిబ్బంది అప్పుగా పట్టేది లేదనడంతో ఆగ్రహించి దాడి చేశారు. దీంతో పెట్రోలు బంకులో పని చేస్తున్న గంపా రత్నమయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ చేసి దేవర బాలకృష్ణతోపాటు మరో ముగ్గురిపై గురువారం కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment