పులివెందుల క్యాంపు కార్యలయం వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం జనాలతో కిటకిటలాడింది. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభించింది. స్థానిక జనాలే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు సైతం భారీగా తరలిరావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ క్యాంపు కార్యాలయం రద్దీగా ఉండిపోయింది. ఆపన్నహస్తం కోసం కొందరు, అభిమానం చూపేందుకు మరికొందరు, భరోసా కోసం ఇంకొందరు ఇలా... ఎవరికివారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో తోపులాట సైతం తెరపైకి వచ్చింది. ఏ ఒక్కర్ని నిరుత్సాహపర్చకుండా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందరితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆప్యాయంగా మాట్లాడారు. అండగా ఉంటానంటూ భరోసా కల్పించారు.
● మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పులివెందుల క్యాంపు కార్యాలయంలో 10గంటలు పాటు నిల్చునే ఉండిపోయారు. ఉదయం 9గంటలకు ఆయన ప్రజాదర్బార్ చేపట్టారు. అప్పటికే వేచి ఉన్న వందలాది ప్రజానీకానికి గంట గంటకు జనం తోడై వేల మంది క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం మొదలు రాత్రి 8గంటల వరకూ మధ్యలో ఒక గంటపాటు మధ్యాహ్న బోజనం సమయం మినహా పగలంతా ప్రజలతో మాట్లాడడంలోనే నిమగ్నమయ్యారు.
ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలు చేపట్టాలని పిలుపు...
ప్రజల్ని ప్రభుత్వం వంచింది. పైగా పన్నుల భారం మోపుతోంది. ఆర్థికంగా నడ్డి విరుస్తోంది. ఈ క్రమంలో ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలు కొనసాగించాలని తరలివచ్చిన కేడర్‌కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. టీడీపీ దౌర్జన్యాలు భరించలేకున్నామని వాపోయిన కేడర్‌కు ‘కష్టాలు ఎల్లకాలం ఉండవు, మంచి రోజులు రానున్నాయి, ఓపిక పట్టండి పార్టీ మీకు అండగా ఉంటుందని’భరోసా ఇచ్చారు. ఇలా కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు.
● కాగా ప్రజా సమస్యలను ఆలకించిన వైఎస్ జగన్ స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. పలు సమస్యల పరిష్కారానికి పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీలు డీసీ గోవింద రెడ్డి, రమేష్‌యాదవ్, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, జిల్లా ఽఅధ్యక్షుడు పి రవీంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌బీ అంజద్‌బాషా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి మేకా ప్రతాప్ అప్పారావు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, శింగనమల సాంబశివారెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎల్లో మీడియా దుష్ప్రచారం
రద్దీ ఎక్కువై అభిమాన నాయకుడిని త్వరగా కలుసుకోవాలనే ఆరాటంతో కార్యకర్తలు మధ్య ఓ దశలో తోపులాట తెరపైకి వచ్చింది. అంతే.. ‘అదిగోపులి అంటే ఇదిగో తోక’అంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని అందుకుంది. కార్యా లయంపై రాళ్లు దాడి అంటూ వండి వార్చడంలో నిమగ్నమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఎల్లోమీడియాపై విరుచకపడ్డారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని ఇకనైనా మానాలంటూ హితవు పలికారు.
నేడు వివాహానికి హాజరుకానున్న వైఎస్ జగన్
పులివెందుల రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు రోజుల పర్యటనలో భాగంగా నాల్గవ రోజు శుక్రవారం పులివెందుల పట్టణంలోని స్థానిక విజయ్ గార్డెన్‌లో జరిగే ఓ వివాహ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వైఎస్ జగన్‌తోపాటు ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడ నుంచి తాడేపల్లెకు బయలుదేరి వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment