బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌కు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గురువారం విచ్చేశారు. ఉదయం వచ్చిన ఆయన కొంతసేపు పోలీసు అతిథి గృహం విడిదిచేసి మధ్యాహ్నం వెనుదిరిగి వెళ్లారు.
వైవీయూ పీజీ పరీక్షల షెడ్యూలులో మార్పు
వైవీయూ: యోగివేమన యూనివర్సిటీ, అను బంధ పీజీ కళాశాలల ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు 2025 సంవత్సరం జనవరి 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.రఘునాథరెడ్డి తెలిపారు. డిసెంబరు నెల 30వ తేదీ నుంచి జరగాల్సి ఉన్నా విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని మార్పు చేశామన్నారు. జనవరి 21, 23, 25, 27, 29, 31 తేదీలలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.
నేడు ఉద్యోగమేళా
రాయచోటి (జగదాంబసెంటర్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జిల్లాలోని పీలేరు, రైల్వేకోడూరులలో ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పీలేరు పట్టణంలోని ఎస్‌జీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో, రైల్వేకోడూరు గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్‌లో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంకు, ఏయు స్మాల్ ఫినాన్స్ బ్యాంకు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. మరిన్న వివరాలకు పీలేరు–9966086996, రైల్వేకోడూరు–9550095775 నంబర్లలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
5న జిల్లా స్థాయి ఎంపికలు
కడప స్పోర్ట్స్: ఉమ్మడి వైఎస్‌ఆర్ కడప జిల్లాస్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఎంపికలు జనవరి 5వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సింగం భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో 35 ఏళ్లు పైబడిన క్రీడాకారులు మొదలు ప్రతి 5 సంవత్సరాలకు ఒక విభాగం చొప్పున 65 సంవత్సరాలు పైబడిన క్రీడాకారులకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పురుషులు, మహిళల విభాగాల్లో సింగిల్స్, డబుల్స్ వేర్వేరుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు తాను అర్హత కలిగిన విభాగాల్లో ఒక సింగిల్, ఒక డబుల్, ఒక మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పాల్గొనేందుకు అర్హులని టోర్నీ రెఫరీ ఎస్. జిలానీబాషా తెలిపారు.వివరాలకు 9440107080, 9866028100 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment