హత్య కేసులో నిందితుల అరెస్ట్
గాలివీడు : మండలంలోని బోరెడ్డిగారిపల్లి వద్ద రెండు రోజుల క్రితం కళాకారుడు సత్యన్న అలియాస్ వెంకటరమణ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిందితులను హాజరు పరిచి, వివరాలు వెల్లడించారు. బోరెడ్డిగారిపల్లి గ్రామ కస్పాలో పెద్ద ఖర్మ సందర్భంగా కీచకవధ వీధి నటకం ప్రదర్శించారు. ఆ సందర్భంలో వెంకటరమణారెడ్డి కీచకుని పాత్ర పోషించగా, తలారి పాత్రలో సత్యన్న అలియాస్ వెంకటరమణ నటించారు. నాటకం ప్రదర్శిస్తుండగా ఇరువురి మధ్య మనస్పర్థల కారణంగా గొడవ మొదలైంది. గ్రామంలో ఉన్న పెద్దలు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. అయినా వారి మధ్య వాగ్వాదం పెరిగి, నాటకం మాధ్యలోనే ఆపివేశారు. ఈ క్రమంలో సత్యన్న, రమణారెడ్డి తిరుగు ప్రయాణమై బోరెడ్డిగారిపల్లి బస్‌స్టాప్ వద్దకు రాగానే.. కోపం పెంచుకున్న వెంకటరమణారెడ్డి సత్యన్న తలపై బండరాయితో బలంగా కొట్టాడు. దీంతో సత్యన్న అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే వెంకటరమణారెడ్డి తన కుమారులకు ఫోన్ చేసి సంఘటన స్థలానికి పిలిపించుకున్నారు. తమ సొంత ఆటోలో సత్యన్న మృతదేహాన్ని వేసుకుని సమీపంలోని మంగళపల్లి గుట్ట వద్ద పడేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితులు వెంకటరమణారెడ్డి, ఆయన కుమారులు శివశంకర్‌రెడ్డి, రామాంజులురెడ్డిని పోలీసులు గరుగుపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించిన లక్కిరెడ్డిపల్లి సీఐ కొండారెడ్డి, ఎస్‌ఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment