పోక్సో కేసు నమోదు
పెద్దతిప్పసముద్రం : ప్రేమ పేరుతో వంచించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ బాలికను మోసం చేసిన కేసులో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసామని ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. బాలిక పోలీసులకు చేసిన ఫిర్యాదు, ఎస్‌ఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పట్టెంవాండ్లపల్లి పంచాయతీ బాగేపల్లికి చెందిన ఓ మైనర్ బాలిక సమీపంలోని కందుకూరులో పదో తరగతి చదువుతోంది. కందుకూరు గ్రామానికి చెందిన గుర్రాల నరసింహులు(23) అనే యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 19న బాలికకు మాయమాటలు చెప్పి అపహరించుకెళ్లాడు. బాలికను బెంగళూరు, చైన్నె లాంటి నగరాల్లో షికార్లు చేయించి శారీరకంగా వంచించాడు. ఈ తరుణంలో మైనర్ బాలిక తల్లి సుజాత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో అప్రమత్తమయ్యాడు. దీంతో సదరు యువకుడు భయపడి బాలికను ఊర్లో వదిలి పరారయ్యాడు. అనంతరం జరిగిన ఘటనపై బాలిక పోలీసుల ఎదుట వెల్లడించింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి కన్నవాళ్లకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు యువకుడిపై ఎస్సీ, ఎస్టీతోపాటు పోక్సో కేసు నమోదు చేసామని ఎస్‌ఐ వెల్లడించారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
రామాపురం : కర్నూలు – చిత్తూరు 40వ జాతీయ రహదారి మండల పరిధిలోని గువ్వలచెరువు ఘాట్‌పై గురువారం ప్రమాదం త్రుటిలో తప్పింది. ఘాట్ రెండవ మలుపు వద్ద సిమెంటు లారీ అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. రక్షణ గోడపైకెక్కి లారీ ఆగిపోయింది. దీంతో ప్రమాదం నుంచి డ్రైవర్, క్లీనర్ బయటపడ్డారు. రక్షణ గోడ లేనిపక్షంలో లారీ 50 అడుగుల లోయలో పడిపోయేది. తుపాను కారణంగా చిరుజల్లులు కురుస్తుండడంతో రోడ్డుపై తేమ ఉండడం.. టైర్లు రోడ్డు గ్రిప్పు కోల్పోవడం వల్ల మలుపులో ఘాటు దిగుతూ ఉండడం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కావున ఘాటుపై ప్రయాణించే వాహనదారులు నెమ్మదిగా వెళ్లి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment