విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు
మదనపల్లె : పట్టణ ప్రశాంతతకు భగ్నం కలిగించేలా వ్యవహరించి, పోలీసు విధులకు ఆటంకం కలిగించిన ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అన్నారు. గురువారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన ఘటన... ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనాలతో రోడ్డుపై వెళుతున్నప్పుడు జరిగిన గొడవ అన్నారు. ఓ యువకుడు తన తల్లిని తీసుకుని ద్విచక్రవాహనంలో వస్తుండగా, ముందు ద్విచక్రవాహనంలో వెళుతున్న మరో యువకుడు సడెన్‌గా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న యువకుడు వాహనాన్ని కంట్రోల్ చేసే క్రమంలో వాగ్వివాదం జరిగిందన్నారు. ఇద్దరి మధ్య జరిగిన ట్రాఫిక్ సమస్య ఘటనను తీసుకుని కలహాలు రెచ్చగొట్టేలా కొందరు వ్యక్తులు ప్రవర్తించారన్నారు. బాధితుడు బహిరంగంగా పోలీసులు తనకు న్యాయం చేశారని చెప్పినా.. నిందితుడితో బాధితుడికి క్షమాపణ చెప్పించినప్పటికీ కొందరు ఉద్దేశ పూర్వకంగా వివాదాన్ని పెద్దది చేసేందుకు ప్రయత్నించారన్నారు. బాధితుడు సామాజిక మాధ్యమాల్లోనూ తనకు న్యాయం జరిగిందని పోస్ట్ పెట్టాడని, అతడు సంతృప్తిగా ఉన్నప్పటికీ, ఘటనను సాకుగా తీసుకుని, పట్టణ ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు కొందరు ప్రయత్నించారన్నారు. ఘటనతో ఎలాంటి సంబధం లేని కొందరు ఆకతాయిలు మద్యం మత్తులో అకారణంగా ఓ ప్రైవేట్ ఆస్తిని ధ్వంసం చేయడమే కాకుండా ఉద్రిక్త వాతావరణానికి కారకులయ్యారన్నారు. ఘటన జరిగిన సమయంలో సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఘర్షణకు కారకులను గుర్తిస్తున్నామని, ఇప్పటి వరకు 50 మందిని గుర్తించామని, మిగిలిన వారందరినీ గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు. అకారణంగా గొడవలు చేస్తే దాని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కొండయ్యనాయుడు, సీఐలు రామచంద్ర, సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు
మద్యం మత్తులో ఘర్షణకు దిగిన
50 మందిపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment