పశువుల అక్రమ రవాణా
బి.కొత్తకోట : తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు నుంచి తమిళళనాడుకు అక్రమంగా పశువులను తరలిస్తున్న కేసులో ఆరుగురిని అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులంతా చిత్తూరు జిల్లాకు చెందిన వారే. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సీఐ జీవన్ గంగనాథ్‌బాబు తెలిపారు. గురువారం అనంతపురం జిల్లా నుంచి బి.కొత్తకోట మండలం మీదుగా రెండు లారీల్లో ఆవులను తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నారని బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన కె.రవీంద్ర.. బయ్యప్పగారిపల్లె వీఆర్‌ఓ రవికుమార్ దృష్టికి తీసుకొచ్చాడు. వీఆర్‌ఓ ఈ విషయాన్ని తహసీల్దార్‌కు తెలపగా ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వీఆర్‌ఓ సీఐకు చెప్పగా స్పందించి జాతీయ రహదారిపై పెద్దపల్లి క్రాస్ వద్దకు పోలీసులను పంపారు. అదే సమయంలో రెండు లారీలు రాగా.. పోలీసులు, గ్రామస్తులు తనిఖీ చేశారు. లారీల్లో 66 పశువులు ఉన్నట్టు గుర్తించారు. వీటిని తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలంలో పలుచోట్ల సంతల్లో కొనుగోలు చేసి తమిళనాడులోని సేలంలో జంతువధశాలకు తరలిస్తున్నట్టు నిర్ధారించారు. అనుమతి, లైసెన్సు లేకుండా కబేళాలకు అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించడంతో దీనిపై చర్యలు తీసుకోవాలని వీఆర్‌ఓ రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ఎస్.మహ్మద్ ఆరీఫ్, పెద్దపంజాణీ మండలం రాయలపేటకు చెందిన షేక్ అబ్దుల్ మునాఫ్(62), జి.సుబ్రమణ్యం(53), ఎస్.ముబారక్(39), కె.కృష్ణప్ప(60), కె.మాబుబాషా(53), పలమనేరు పట్టణానికి చెందిన ఎస్.అక్బర్(60)లపై కేసు నమోదు చేశారు. వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేయగా ఎస్.మహ్మద్ ఆరీఫ్ పరారీలో ఉన్నట్టు సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న పశువులను తంబళ్లపల్లెలోని నవశక్తి గోశాలకు తరలించారు.
ఆరుగురి అరెస్ట్
పరారీలో ప్రధాన నిందితుడు
Comments
Please login to add a commentAdd a comment