వైకుంఠ ఏకాదశికి వసతులు కల్పిస్తాం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం వద్ద ఉన్న అధికారిక భవనంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని సాలాబాద్ క్రాస్ రోడ్డు నుంచి ఆలయం వరకు టీటీడీ అటవీశాఖ వారు నాటిన మొక్కలను పరిశీలించారు. అనంతరం బ్రహ్మోత్సవాల సమయంలో కల్యాణం రోజు కల్యాణ వేదిక వద్దకు వచ్చే భక్తులు క్యూలైన్ల వద్ద ఇబ్బంది పడకుండా అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒంటిమిట రామయ్య భూములను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని టీటీడీ సివిల్ డిపార్టుమెంట్ అధికారులకు సూచించారు. అలాగే కల్యాణ వేదిక వద్ద పైప్‌లైన్ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. టీటీడీ డీఎఫ్‌ఓ శ్రీనివాసులు, ఎలక్ట్రికల్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, సివిల్ ఈఈ సుమతి, డీఈ నాగరాజు, ఏఈ అమరనాథ్‌రెడ్డి, జనరల్ డిప్యూటీ ఈఓ శివ ప్రసాద్, ఒంటిమిట్ట డిప్యూటీ ఈఓ నటేష్ బాబు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment