రాయచోటి (జగదాంబసెంటర్) : జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి బీసీ, కాపు, ఈబీసీ వారికి కేటాయించిన లక్ష్యాలకు అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం కార్యనిర్వహణ సంచాలకురాలు డి.శిరీషా ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం ఉపాధి పథకం కింద జిల్లాలో 1907 యూనిట్లు ఉన్నాయన్నారు. అలాగే ఈబీసీకి చెందిన నిరుద్యోగ యువతకు జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు సంబంధించి జిల్లాలో 57 యూనిట్లు ఉన్నాయన్నారు. అర్హత కలిగినవారు ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కౌలు రైతులు పంట రుణాలకు దరఖాస్తు చేసుకోండి
రాయచోటి టౌన్ : జిల్లాలోని కౌలు రైతులు పంట రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎల్‌డీఎం ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. సమీపంలోని ఏదైనా బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రుణాలు పొందే క్రమంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే 08561–293903 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
డీఆర్‌పీ పోస్టుల భర్తీకి
అర్హులకు అవకాశం
రాయచోటి (జగదాంబసెంటర్) : పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్(పీఎంఎఫ్‌ఎంఈ)లో జిల్లా రీసోర్స్ పర్సన్(డీఆర్‌పీ) పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని అన్నమయ్య జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ బి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఏదేని డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్, ఇంటర్నెట్ రంగంలో ప్రావీణ్యం కలవారు ఈ నెల 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9182345972, 9676736623, 9618971075 నంబర్లను సంప్రదించాలని కోరారు.
సౌమ్యనాథ స్వామి హుండీ ఆదాయం రూ. 2,29,555
నందలూరు : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చరిత్రాత్మక నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయ హుండీని మంగళవారం లెక్కించారు. దాదాపు రూ. 2,29,555 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఒక నెల రోజుల హుండీని లెక్కించామన్నారు. మొత్తం డబ్బును ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, టీటీడీ విజిలెన్స్ అధికారి మల్లారెడ్డి, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
9న రాజంపేటకు
హర్యానా గవర్నర్ రాక
రాయచోటి : ఈనెల 9న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాజంపేటకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. రాజంపేటలోని అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ విద్యాసంస్థ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం, అన్నమాచార్య విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో గవర్నర్ పాల్గొంటారని పేర్కొన్నారు.
నేడు కేంద్ర
కరువు బృందం పర్యటన
బి.కొత్తకోట : కేంద్ర కరువు బృందం బుధవారం తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో పర్యటించనుంది. ఢిల్లీ నుంచి బెంగళూరు మీదుగా ఈ బృందం మంగళవారం రాత్రికి బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ చేరుకుటుంది. ఇక్కడ బస చేసి బుధవారం ఉదయం 9 గంటలకు పర్యటన ప్రారంభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పాలసీ, కోఆర్డినేషన్స్ విభాగం సంయుక్త కార్యదర్శి పెరిన్‌దేవి నాయకత్వంలో బృంద సభ్యులైన డిప్యూటి డైరెక్టర్ సుప్రియా మాలిక్, నీతి అయోగ్ పరిశోధనా అధికారి అనురాధ బటనా, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం డిప్యూటీ అడ్వయిజర్ ఆశిశ్ పాండేలు కరువు పరిస్థితులను పరిశీలిస్తారు. ఉదయం 9.45 గంటలకు బి.కొత్తకోట మండలం తుమ్మనంగుట్ట ఆర్‌బీకే వద్దకు బృందం చేరుకుంటుంది. ఇక్కడ అధికారులు ఏర్పాటు చేసిన కరువు ఫొటోల ప్రదర్శన తిలకించాక రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. 10.05 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి తంబళ్లపల్లె మండలంలోని కోటకొండకు చేరుకుని 10.40 గంటల నుంచి 11 గంటల వరకు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. కురబలకోట మండలంలోని మట్లివారిపల్లెలో 11.15 గంటల నుంచి 11.35 గంటల వరకు రైతులతో నేరుగా మాట్లాడతారు. తర్వాత పీలేరు నియోజకవర్గం వాయల్పాడు మండలంలోని జంగావారిపల్లెలో 11.55 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంట ల వరకు రైతులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 12.35 గంటల నుంచి 12.55 గంటల వరకు మదనపల్లె నియోజకవర్గంలోని చిన్నతిప్పసముద్రంలో రైతులతో ముఖాముఖి అయ్యాక అక్కడి నుంచి మదనపల్లెకు బయలుదేరి వెళ్తారు. కాగా తొలుత కేంద్ర బృందం పర్యటన మూడు గంటల పాటు కొనసాగుతుందని ప్రకటించారు. అయితే చివరకు ఒకటిన్నర గంటకు కుదించారు. అంటేఊ బృందం పర్యటించే ప్రతిచోట 20 నిమిషాలు మాత్రమే కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment