ప్రైవేట్ చేతికి ప్రయాణప్రాంగణం!
రాయచోటి: తరతరాలుగా రాయచోటి నియోజకవర్గ ప్రజలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే ప్రయాణికులకు సుపరిచితంగా ఉన్న రాయచోటి పాతబస్టాండ్ రాబోయే రోజుల్లో ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల్లోకి వెళ్లనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రాంతాన్ని మూడు విభాగాలుగా విభజించి పంచుకునేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ స్థలం కోసం స్థానికంగా ఉన్న కొంతమంది ప్రైవేటు వ్యక్తులు తప్పుడు రికార్డులు సృష్టించి ఆక్రమణకు ప్రయత్నాలు చేశారు. స్థానిక నాయకులు, అధికారులు వారి ప్రయత్నాలను తిప్పికొడుతూ ఆస్తిని కాపాడుకుంటూ వచ్చారు. అయితే కాలానుగుణంగా వచ్చిన రాజకీయ మార్పులు, అధికారుల్లో లోపించిన నిబద్ధతను ఆక్రమ ణదారులు సొమ్ము చేసుకునే ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వంలో ఆక్రమణదారులకు అన్ని విధాలుగా అనుకూల వాతావరణం నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమని, నాలుగు గదుల మధ్య జరుగుతున్న బహిరంగ రహస్య ఒప్పందం పూర్తయిందన్న సమాచారం జిల్లా కేంద్రంలో దావానంలా వ్యాపించింది.పాత బస్టాండ్ ప్రాంగణాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఆందోళన చేస్తామని నియోజకవర్గ ప్రజలు హెచ్చరిస్తున్నారు.
పంచాయతీ నుంచి..
రాయచోటి పంచాయతీ ఏర్పాటైనప్పటి నుంచి నాటి అధికారులు, పాలకులు ప్రజల సౌకర్యార్థం సర్వే నంబరు. 784/1లోని 0.28 సెంట్ల భూమిని కొనుగోలు చేసి బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు. ఈ బస్టాండ్ నుంచే 2010 వరకు బస్సుల రాకపోకలు సాగేవి. పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా ఆనాటి ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి హయాంలో పక్కనే ఉన్న క్లబ్‌ను ఆర్‌అండ్‌బీ కార్యాలయానికి తరలించి ఆ ప్రాంతాన్ని కూడా బస్టాండ్ నిర్వహణకు అనుమతులు ఇప్పించారు. పంచా యతీ మున్సిపాలిటీగా అభివృద్ధి చెందడం, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల బస్సులకు అనుగుణంగా ఉండేలా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పక్కనే ఉన్న 30 సెంట్ల రెవెన్యూ స్థలాన్ని కేటాయించి రూ. 2.5 కోట్లతో భవన సముదాయాన్ని నిర్మింపచేశారు. పాతబస్టాండ్ ప్రాంతాన్ని పూలు, పండ్లు ఇతర చిరు వ్యాపారులకు ఆ స్థలాన్ని కేటాయించారు.
కలెక్టర్ ఉత్తర్వులు భేఖాతర్
రాయచోటిలోని 28 సెంట్లలో పాతబస్టాండ్ ప్రాంతాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ 2011లో నాటి కడప జిల్లా కలెక్టర్ కోర్టుకు ఆధారాలతో సంబంధిత పత్రాలను అందజేశారు. నాటి కలెక్టర్ ఆదేశాల ఆధారంగానే 2023లో జిల్లా కలెక్టర్ కూడా ఇది ప్రభుత్వ స్థలమేనని, ఇందులో ఇతరులు జోక్యం చేసుకోవడానికి వీలు లేదని కోర్టుకు తెలియపరిచినట్లు రికార్డులు ఉన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికార దర్పంతో జిల్లా అధికారులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
మెప్మా భవనం నిర్మాణం
కలెక్టర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి: శ్రీకాంత్‌రెడ్డి
జిల్లా కలెక్టర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వ స్థలాలను కాపాడటంలో నిక్కచ్ఛిగా వ్యవహరించాలన్నారు. పాతబస్టాండ్ స్థల విషయంపై కూడా గత జిల్లా పాలకులు ఇచ్చిన నివేదికలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కలెక్టర్ బంగ్లా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా కలెక్టర్ చూడాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.
కోట్ల రూపాయలు విలువచేసే రాయచోటి పాతబస్టాండ్ స్థలం ఆక్రమణకు రంగం సిద్ధం
పాతబస్టాండ్ ప్రాంగణంలో 2008–09 సంవత్సరంలో రూ. 28 లక్షలతో మెప్మా భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఈ భవనంలోనే మీసేవ కార్యాలయం కూడా నడుస్తూ వచ్చింది. మిగిలిన ప్రాంగణంలో పూలు, పండ్లు వ్యాపారులు వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నారు. దీనిని పంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment