సాక్షి రాయచోటి: సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌లో ఆర్థిక యుద్ధాలు మొదలయ్యాయి. ఎక్కడికక్కడ..ఎవరికి వారు ఆధిపత్యం కోసం కాలు దువ్వుతున్నారు. ఆది నుంచి అధికార పార్టీలో కుమ్మలాటలు కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయించేందుకు కీలక నేతలు కూడా పోటీ పడుతున్నారు. అఽధిష్టానం మాత్రం ఇంతవరకు ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలనుకూడా ప్రకటించలేని పరిస్థితి కొనసాగుతుండగా..తమ్ముళ్ల మధ్య తగువులాటలు యదా రాజా...తథా ప్రజా అన్నట్లుగా జరుగుతున్నాయి. సంపాదించుకోవడంతోపాటు ఆధిపత్యం విషయంలో వర్గాల మధ్య తీవ్ర స్థాయి పోటీ నెలకొనడంతో నువ్వా, నేనా అన్న పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని నియోజకవర్గాల్లోని టీడీపీ శ్రేణుల మధ్య వర్గాలు ఏర్పడి చివరకు సై అంటే...ౖసైసె అంటూ కాలు దువ్వుతున్నారు.
రాజంపేటలో పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా..
అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీలో వర్గ విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒకవైపు జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు, మరోవైపు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రమణ్యం వర్గాల మధ్య పోటాపోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గత ఆగస్టులో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా రిబ్బన్ కత్తిరించే విషయంలో కీలక నేతలైన జగన్‌మోహన్‌రాజు, బాలసుబ్రమణ్యంలు తోసుకోవడంతో క్యాకర్తలు విస్తుపోయారు. ఎక్కడికక్కడ శ్రేణులు కూడా గ్రూపులుగా ఏర్పడ్డాయి. ఒక వర్గం అంటే మరొక వర్గానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇటీవల ఒంటిమిట్టలో జరిగిన రెవెన్యూ సదస్సులో రెండు వర్గాల మధ్య వాగ్వాదాలు, బహిరంగ సవాళ్లు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం పార్టీకార్యక్రమమైనా, అధికారిక కార్యక్రమమైనా ఒక వర్గం పాల్గొంటున్నా మరొకవర్గం అలజడులు రేపుతోంది. రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ ఇన్‌ఛార్జిని టీడీపీ ప్రకటించలేక పోతోంది.
రైల్వేకోడూరులో పెరిగిన గ్రూపులు..
రైల్వేకోడూరు నియోజకవర్గంలో అధికారులకు తంటాలు ఎక్కువయ్యాయి. కార్యకర్తల మధ్య కూడా గ్రూపులు పెరిగిపోయాయి. స్థానికంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉన్నప్పటికీ పెత్తనమంతా అధికార పార్టీకి చెందిన రూపానందరెడ్డి కుటుంబానిదేనని జగమెరిగిన సత్యం. అక్కడ అంతా కుటుంబ పాలనే కొనసాగుతోంది. టీడీపీ మాజీ ఇన్‌ఛార్జి కస్తూరి విశ్వనాథనాయుడు వర్గంతోపాటు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు వర్గం జనసేన నేతలకు కూడా సరిపోవడం లేదు. దీంతో ఎవరికి వారుగా వర్గాలుగా విడిపోవడంతో అయోమయ పరిిస్థితి నెలకొంది. అధికారులకు కూడా ఒక వర్గం ఒక పని చేయాలని చెబితే....మరొక వర్గం అది చేయవద్దని హకుం జారీ చేస్తుండటం గమనార్హం. అక్కడ కూడా వర్గాల మధ్య లోలోపల అంతర్యుద్ధం కొనసాగుతోంది. అయితే అధికార పార్టీలో ఉన్న రూపానందరెడ్డి కుటుంబీకులు చెప్పిన పనులే జరుగుతుండడం పార్టీలో ఇతర వర్గాలకు ఎంతమాత్రం రుచించడం లేదు. మదనపల్లెలోనూ ఎమ్మెల్యే షాజహాన్‌బాషకు వ్యతిరేకంగా కొన్ని వర్గాలు బయటపడకుండా లోలోపల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇలా జిల్లా అంతటా టీడీపీలో వర్గ విబేధాలు కొనసాగుతూ నేతలు, కార్యకర్తలతోపాటు అధికారులకు తలనొప్పిగా మారాయని పలువురు పేర్కొంటున్నారు.
జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో నేతల మధ్య వర్గపోరు ముదిరింది. ప్రధానంగా అధికారుల బదిలీలు మొదలుకొని వర్గాల మధ్య ప్రచ్చన్నయుద్ధం అధికమైంది. ఇక్కడ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన జయచంద్రారెడ్డి,మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయుల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు వెళ్లి తమకంటే తమకే ఇన్‌చార్జి పదవి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేష్‌ను కలిసి విన్నవించారు. అయినప్పటికీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేయకపోగా, ప్రతిసారి వర్గ పోరు తలనొప్పిగా మారుతోంది. తాజాగా ములకలచెరువు, తంబళ్లపల్లె, బి.కొత్తకోట ప్రాంతాల్లో వర్గాల మధ్యంయుద్ధ వాతావరణం నెలకొని మంత్రి లోకేష్ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ ఒక వర్గం చింపివేసి కేకులను విసిరి కొట్టారు. లోకేష్ జన్మదినం సందర్భంగా రెండు వర్గాల మధ్య ముష్టియుద్ధం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment