నిధులు.. నీళ్లపాలు
● శానిటేషన్ పేరిట నిధుల గోల్‌మాల్
● నాయకుల పేరిట రూ.22 లక్షలు ఖర్చు
● కారణం చూపని టీడీపీ సర్పంచ్, ఆమె భర్త
● సమాచార హక్కు చట్టంతో అక్రమాలు వెలుగులోకి..
పెద్దతిప్పసముద్రం: తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రం మండలం పోతుపేట పంచాయతీ 1160 మంది ఓటర్లు ఉన్న చిన్న గ్రామం. సమాచార హక్కు చట్టం ద్వారా గ్రామ పంచాయతీకి నిధుల మంజూరు, ఖర్చు వివరాలను దరఖాస్తుదారుడికి అధికారులు ఇవ్వడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా ఏర్పడిన ఈ గ్రామ పంచాయతీకి 2019 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రూ.27,66,351 లక్షలు మంజూరయ్యాయి. వీటిని వాటర్ వర్క్స్, శానిటేషన్, పైప్‌లైన్, సీసీ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, డేటా ఎంట్రీ ఆపరేటర్,సర్పంచ్ జీతాల రూపంలో రూ.22,12,902 ఖర్చు చేసినట్లు చూపించగా ప్రస్తుతం రూ.5,53,449లు గ్రామ పంచాయతీలో నిల్వ ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ నిధులతో యంపార్లపల్లి, పిడుంవారిపల్లిలోని రెండు ప్రభుత్వ బోర్లకు కొత్త మోటార్లు అమర్చారు. అయితే పంచాయతీ ఆవిర్బావం నుంచి మంజూరైన నిధులతో కేవలం 200 మీటర్ల లోపు పైప్‌లైన్ పనులు, పోతుపేటలో తాగునీటి ట్యాంకుకు నిచ్చెన ఏర్పాటు అది కూడా పాత బోరు పైపులతో, పోతుపేటలోని ప్రభుత్వ బోరులో లీకేజీ పైపులను వెలికి తీయడం తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. పిడుంవారిపల్లి, చేలూరివాండ్లపల్లి రెండు చోట్లా కలిపి 130 మీటర్ల మేరకు మురికి నీటి కాలువలు ఉన్నాయి. వాటిని శుభ్రపరచిన దాఖలాలే లేవని ప్రజల వాదన. పోతుపేట, యంపార్లపల్లిలో ఒక మీటర్ మురికి కాలువ కూడా లేదు. డ్రైనేజీ వ్యవస్థ లేకున్నా శానిటేషన్ పేరిట రూ. లక్షల నిధులను డ్రా చేసేశారు. పైప్‌లైన్ పనుల పేరిట 13 రోజుల వ్యవధిలోనే రూ,99,800ల చొప్పున రెండు సార్లు నిధులు డ్రా చేయడం, సిమెంట్ రోడ్డు వేయకున్నా రూ.1,31 లక్షలను మెక్కేయడం గమనార్హం. అంతేగాక టీడీపీ మహిళా సర్పంచ్, ఆమె భర్తతో పాటు మండల పరిషత్ కార్యాలయంలో పని చేసే ఓ వ్యక్తి పేరిట రూ.5 లక్షలకు పైగా నిధులు డ్రా చేసినా ఎందుకు ఖర్చు పెట్టారో అధికారులు కారణాలను కనబరచకపోవడం గమనార్హం. రూ.లక్షల నిధుల దుర్వినియోగంపై ఆడిటింగ్ అధికారుల ధోరణిపై పంచాయతీ ప్రజలు మండి పడుతున్నారు.
సమగ్రంగా విచారణ చేపట్టాలి
పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి రూ.27 లక్షల దాకా నిధులు వచ్చినా ఎలాంటి పనులు జరగలేదు. మురికి కాలువలే లేకపోయినా అధికారులు ఉన్నట్టు సృష్టించారు. జిల్లా కలెక్టర్, డీపీవో ఈ విషయంపై సమగ్రంగా విచారణ చేపట్టాలి. –కేవీ రమణ,
ఎన్‌హెచ్‌ఏఏ ఫీల్డ్ లెవల్ కౌన్సిలర్, పోతుపేట
Comments
Please login to add a commentAdd a comment