కూటమి ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం విఫలం

Published Fri, Jan 24 2025 12:49 AM | Last Updated on Fri, Jan 24 2025 12:49 AM

కూటమి ప్రభుత్వం విఫలం

కూటమి ప్రభుత్వం విఫలం

అభివృద్ధి, సంక్షేమంలో
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

రాయచోటి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ప్రజలకు చేసిన అభివృద్ధి, సంక్షేమం శూన్యమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. శ్రీకాంత్‌ రెడ్డి ఆరోపించారు. గురువారం రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రభుత్వ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువతకు మంచి జరగలేదన్న విషయాలను గణాంకాలతో సహా వివరించారు. పాలనను చేపట్టి ఎనిమిది నెలలు గడుస్తున్నా నేటికీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. అసెంబ్లీలో టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలే రాష్ట్ర వ్యాప్తంగా 2019–2024 మధ్య కాలంలో ఎన్ని ల్యాండ్‌ గ్రాబింగ్‌ లు జరిగాయి, ఎన్ని అసైన్‌ మెంట్‌ కమిటీలు అక్రమంగా జరిగాయన్న వివరాలను ఆడిగారన్నారు. ఇందుకు రాయచోటి నియోజక వర్గ పరిధిలోని అన్ని మండలాల తహసీల్దార్లు ఎటువంటి భూ అక్రమాలు జరగలేదని సీసీఎల్‌ఏ కు పూర్తి నివేదికలు పంపారన్నారు. ఆ నివేదిక ప్రతులను శ్రీకాంత్‌ రెడ్డి విలేకరులకు చూపించారు.

● వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాయచోటిలో ఒకే చోట 6 వేల మందికి పక్కా గృహాలు మంజూరు చేసి, ఇళ్ల స్థలాలను అందచేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన పక్కా గృహాలు ఎక్కడా లేవన్నారు.

● అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత రాయచోటిలో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ భూములను కేటాయిం చామన్నారు.

● గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగివుంటే బయట పెట్టాలని కూటమి నాయకులకు సవాల్‌ విసిరారు.

● గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు హోల్‌ సేల్‌, రీటైల్‌, చిల్లర అంగళ్ల వ్యాపారాలు 70 శాతం తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. నిర్మాణ రంగం, రియల్‌ ఎస్టేట్‌ లేదని వాటి అభివృద్ధికి కృషి చేయాలే కానీ, ప్రతిపక్షంపై అనవసరంగా బురద చల్లొద్దని ఆయన హితవు పలికారు.

● నూతన జిల్లాల ఏర్పాటులో రాయచోటిలోనే అన్ని వసతులతో కూడిన పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌, కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయ భవనాలను తక్కువ కాల వ్యవధిలోనే సమకూర్చామన్నారు.

● 15 శాతం జీడీపీని పెంచుతామని చంద్రబాబు నాయుడు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

● రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో నలుగురు ఉన్న వైద్యుల స్థానంలో 24 మందిని నియమించడమే కాకుండా వంద పడకల ఆస్పత్రిగా, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం కొత్త నిర్మాణాలపై దృష్టి సారించాలని, కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేయొద్దని శ్రీకాంత్‌ రెడ్డి కోరారు.

● బనకచర్ల క్రాస్‌ కు పోలవరం నీళ్లు తెస్తామని చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలను మభ్య పెట్టడానికి చెబుతున్న మాటల్లో ఇది ఒకటి అని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ లో ఏడు నెలలుగా నీళ్లను కిందకు వదిలారన్నారు. కనీస లెవెల్స్‌ను నిర్వహించకుండా, డెడ్‌ స్టోరేజీలో నీళ్లు లేకుండా తోడేసారన్నారు.శ్రీశైలంలో నీళ్లు ఉంటే కదా రాయలసీమకు మంచి జరిగేది అని అన్నారు. చుక్క నీరు లేకుండా చేసిన బాబుకు రాయలసీమ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.60 శాతం మేర పూర్తయిన రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను పూర్తి చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

● గండికోట ప్రాజెక్ట్‌లో స్టోరేజ్‌ పెంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కు లింకేజ్‌ చేయాలన్నారు.గండికోట నుంచి వెలిగల్లుకు లింక్‌ అప్‌ చేసేలా చేపట్టిన పనులను 50, 60 శాతం పూర్తి చేశామన్నారు. దానిని టేక్‌ ఆఫ్‌ చేయాలే కానీ, మళ్లీ చిత్రావతి నుంచి తీసుకువస్తామని చెప్పడంలో అర్థం లేదన్నారు.

● వచ్చిన నిధులన్నింటినీ అమరావతికే ఖర్చు చేస్తుండడంతో రాయలసీమ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. సీమ వాసులను మాట్లాడనీయకుండా ఉండడానికే బనకచర్ల క్రాస్‌ పేరు చెపుతున్నారే కానీ పూర్తి చేయాలన్న ఉద్దేశం చంద్రబాబుకు లేదన్నారు. మీకు రాయలసీమపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కర్నూలులోనే హైకోర్టు ను కొనసాగించాలన్నారు. రాయలసీమ లోని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ లను పూర్తి చేసిన తరువాతనే బనకచర్ల క్రాస్‌ గురించి మాట్లాడాలని ఆయన చంద్రబాబుకు సూచించారు.

● దావోస్‌ పర్యటనలతో అద్భుతాలు సాధిస్తాం.. ఎన్నో పరిశ్రమలు తెస్తామంటూ చంద్రబాబు గొప్పలు చెప్పడం తప్ప రాష్ట్రానికి ఏమి తీసుకు రాలేరన్నారు. 2018 పర్యటనలో రాష్ట్రానికి 150 సంస్థలు, ఎయిర్‌ బస్‌, అలీ బాబా, ప్రకాశం జిల్లాకు జిందాల్‌, రక్షణ పరికరాల ప్లాంట్‌ లాక్‌ హీడ్‌, హై స్పీడ్‌ రైళ్ల కర్మాగారం, హైబ్రిడ్‌ క్లౌడ్‌ (సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం) వంటివి వస్తున్నాయని చెప్పారన్నారు. అప్పటి నుంచి ఇంకా వస్తూనే ఉన్నాయని ఆయన ఏద్దేవా చేశారు. దావోస్‌ పర్యటనలతో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్‌ అయినా వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రాలో 10 పోర్టులు ఉన్నాయని నిన్న చంద్రబాబు చెప్పారన్నారు. వైఎస్‌ఆర్‌ హయాంలో 2, మిగిలినవి జగన్‌ హయాంలో నిర్మాణాలు చేపట్టారన్నారు. జగన్‌ హయాంలో 17 మెడికల్‌ కళాశాలలు తీసుకొచ్చారని చెప్పారు. మెడికల్‌ కళాశాలలు వద్దని లేఖలు రాయడం ద్రోహం కాదా అని ఆయన నిలదీశారు. అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారంటే మీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమేనన్నారు.

● ఎన్నికల హామీలను చంద్రబాబు అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండానే ఎనిమిది మాసాల కాలంలోనే రూ.1.50 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాషా, వైస్‌ చైర్మన్‌ ఫయాజర్‌ రెహమాన్‌, మదనపల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హారూన్‌ బాష, వైఎస్సార్‌సీపీ నాయకులు పడమటి కోన బాబురెడ్డి, కౌన్సిలర్లు గౌస్‌ఖాన్‌, ఎస్‌. ఈశ్వర్‌ ప్రసాద్‌, సుగవాసి శ్యామ్‌,రవీంద్ర యాదవ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement