లింగంగుంట్లలోని 200 పడకల వైద్యశాల
350 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు
200 పడకల ఆస్పత్రి నిర్మించి ప్రారంభించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
ఆరు నెలలు దాటినా 150 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ముందుకు రాని కూటమి ప్రభుత్వం
75 పడకల క్రిటికల్ కేర్ నిర్మాణంలోనూ అదే నిర్లక్ష్యం
నిర్మాణ స్థలం కోసం వేచిచూస్తున్న ఆరోగ్య శాఖ
స్థలం కేటాయింపులో తీవ్ర జాప్యం
ఇబ్బందులు పడుతున్న రోగులు
సమృద్ధిగా నిధులున్నా పనులు చేయాలనే సంకల్పం లేదు. కొన ఊపిరితో రోగుల ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నా.. కాపాడాలన్న కనికరం లేదు. ఆస్పత్రి నిర్మాణానికి అనువైన పరిస్థితులు ఉన్నా ఆరంభం లేదు. పేదలకు వైద్య సేవలు అందించాలనే చిత్తశుద్ధి అంతకన్నా లేదు.. ఇదీ నరసరావుపేటలో ఏరియా వైద్యశాల ఉన్నతీకరణ, క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.
నరసరావుపేట టౌన్ : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది నరసరావుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాల పరిస్థితి. పల్నాడు బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ వైద్యశాలను అప్‌గ్రేడ్ చేసి లింగంగుంట్ల వద్ద గల జలవనరుల శాఖకు చెందిన 4.20 ఎకరాల స్థలంలో 350 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చర్యలు చేపట్టారు. మొదటి దశలో 200 పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తయింది. రెండో దశలో 150 పడకల ఆస్పత్రి నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కూడా చేపట్టారు. రూ.57 కోట్లు నాబార్డు నిధులు మంజూరయ్యాయి. ఎన్నికల కోడ్ రావటంతో పనులు నిలిచాయి.
సరి‘పడక’ వెతలు!
ఏరియా వైద్యశాలలో నిత్యం సుమారు 1,000 నుంచి 1,200 వరకు ఓపీ నమోదవుతోంది. ఇన్‌పేషెంట్‌లుగా మరో 200 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. దీంతో 200 పడకల వైద్యశాల సరిపోవటం లేదు. సీజనల్ వ్యాధులు ప్రబలిన సమయంలో ఒక్కో బెడ్‌పై ఇద్దరికి చికిత్స అందించాల్సిన దుస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 150 పడకల ఆస్పత్రి నిర్మాణంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతోపాటు ప్రధానమంత్రి ఆయూష్‌మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రా మిషన్ ద్వారా మంజూరైన క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ)నిర్మాణంపైనా దృష్టి పెట్టడం లేదు. సీసీబీకి రూ.36.35 కోట్లు మంజూరయ్యాయి. దీనికి టెండర్ పిలవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఆ ప్రక్రియ సాగుతోంది.
స్థలం కోసం కలెక్టర్‌కు నివేదిక
200 పడకల ఆస్పత్రికి అనుబంధంగా మరో 150 పడకల ఆస్పత్రి నిర్మాణానికి స్థలం కేటాయించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కలెక్టర్ అరుణ్ బాబును కోరారు. లింగంగుంట్లలోని వైద్యశాల పక్కనే నిర్మాణం చేపట్టాలని మొదట భావించారు. అయితే ఆ స్థలం తమకు కేటాయించాలని పోలీస్ శాఖ అడగడంతో మరో ప్రాంతంలో స్థలం మంజూరు చేయాలని వైద్యాధికారులు కోరారు.
అనువుగా పాత వైద్యశాల ప్రాంగణం
150 పడకల వైద్యశాలతోపాటు సీసీబీ బ్లాక్ నిర్మాణానికి పల్నాడు రోడ్డులోని పాత వైద్యశాలలో పలు భవనాలు అనువుగా ఉన్నాయి. నిరుపయోగంగా ఉన్న వీటిని పడగొట్టి వాటి స్థానంలో కొత్త 150 పడకల వైద్యశాల, సీసీబీ బ్లాక్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని వైద్యాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ రెండు బ్లాక్‌లను వేర్వేరు చోట్ల నిర్మిస్తే అత్యవసర వైద్యం అందించాల్సిన సమయంలో రోగుల తరలింపు ఇబ్బందితో కూడుకున్నదని చెప్పారు. దీంతో జాయింట్ కలెక్టర్ రెండు నెలల క్రితం పాత ఏరియా వైద్యశాల ప్రాంతాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇదిలా ఉంటే 150 పడకల వైద్యశాల, సీసీబీ బ్లాక్‌ల నిర్మాణంపై కూటమి ప్రభుత్వంగానీ, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కానీ చొరవ చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు దాటినా దీనిపై కనీస చర్యలు చేపట్టడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment