13న ‘అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ’
బాపట్ల: అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై నిరసన గళం వినిపించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఒక పక్కన పెట్టుబడి సాయం అందక.. మరో పక్కన పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. వారికి న్యాయం చేసేందుకు జిల్లా కేంద్రంలో రైతులతో ప్రదర్శన చేపడతామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని మేరుగ తెలిపారు. ఈ మేరకు మంగళవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. అన్నం పెట్టే రైతులను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం ఇప్పట్లో వారు కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టిందని పేర్కొన్నారు. వ్యవసాయం దండగ అని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు మాటకు భిన్నంగా సాగు అంటే పండుగగా చేసి చూపి మహానేత డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగు జాడల్లో ఆయన తనయుడు వైఎస్ జగన్ రైతు పక్షపాతిగా వ్యవహరించారని చెప్పారు. నాటిన విత్తనం దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు వరకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనేక జాగ్రత్తలు తీసుకుని రైతులకు మేలు చేసిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. పెట్టుబడి సాయంగా ప్రతి రైతుకు వ్యవసాయ పనులకు ముందే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. తక్షణమే రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలన్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాలని పేర్కొన్నారు. దళారీ వ్యవస్థను తొలగించాలని, తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. తేమ లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని కోరారు. ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని, రైతుపై అదనపు భారం మోపే చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర సర్కారు తీరుపై 13న నిరసన పెట్టుబడి సాయం లేక విలవిల్లాడుతున్న రైతులు గిట్టుబాటు ధర లేక ధాన్యం విక్రయించలేని దుస్థితి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున కార్యక్రమానికి భారీగా తరలి రావాలని పిలుపు
పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభం కానున్న ప్రదర్శన
పార్టీలకు అతీతంగా రైతులకు మద్దతుగా చేపట్టిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రాంతాల వారు భారీగా పాల్గొనాలని మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. 13వ తేదీ ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు. అక్కడి నుంచి ప్రదర్శనగా జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లనున్నట్లు నాగార్జున తెలిపారు. రైతులకు అండగా నిలివాల్సిన విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్నట్లు నాగార్జున తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధాకర్‌బాబు, కోకి రాఘవరెడ్డి, గవిని కృష్ణమూర్తి, వడ్డిముక్కల డేవిడ్, కొక్కిలిగడ్డ చెంచయ్య, చిన్నపోతుల హరిబాబు, నాగేశ్వరరెడ్డి, ఏడుకొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment