తెనాలితో రాజగోపాల చిదంబరానికి ప్రత్యేక బంధం
తెనాలి: ముంబయిలో శనివారం కన్నుమూసిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, అణ్వస్త్ర పరీక్షల్లో కీలకభూమిక పోషించిన శాస్త్రజ్ఞుడు డాక్టర్ రాజగోపాల చిదంబరానికి తెనాలితో మరపురాని అనుబంధం ఉంది. భారత అణుశక్తి సంఘం చైర్మన్, కేంద్ర ప్రభుత్వ అణుఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు డాక్టర్ చిదంబరం 1999లో తెనాలి వచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన తెనాలికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ పేరిట పురస్కారాన్ని తెనాలిలో ఆయన స్వీకరించారు. నాజరుపేటలోని ఎన్‌వీఆర్ కళ్యాణమండపంలో ఆ ఏడాది నవంబరు 26వ తేదీన ఏర్పాటు చేసిన ప్రత్యేక సభకు ప్రముఖ పాత్రికేయుడు ఆర్.సంపత్ అధ్యక్షత వహించారు. ఆ సభలో ది హిందూ సంపాదకుడు ఎన్.రామ్ చేతులమీదుగా అవార్డును బహూకరించారు. ఈ సందర్భంగా ‘భారత శాసీ్త్రయ పరిశోధన–అభివృద్ధిలో ప్రాధాన్యతలు–ప్రాముఖ్యతలు’ అనే అంశంపై డాక్టర్ చిదంబరం తనదైన శైలిలో నాయుడమ్మ స్మారకోపన్యాసం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా మనం కూడా టెక్నాలజీ ప్రగతికి కలసికట్టుగా కృషి చేయాలని తన ఉపన్యాసంలో సూచించారు. నాయుడమ్మ ట్రస్ట్ వ్యవస్థాపకుడు పి.విష్ణుమూర్తి ఆనాటి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment