ఆర్థికాభివృద్ధిలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కీలకం
కొరిటెపాడు (గుంటూరు): దేశ ఆర్థికాభివృద్ధిలో రిజర్వు బ్యాంకు అధికారులు, ఉద్యోగుల పాత్ర మరువలేనిదని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) రీజినల్ హెడ్ ఎస్.జవహర్ పేర్కొన్నారు. బ్రాడీపేటలోని పెన్షనర్స్ హోం సమావేశ మందిరంలో గుంటూరు జిల్లా బ్యాంక్ రిటైరీస్ కో ఆర్డినేషన్ కమిటీ సర్వసభ్య సమావేశం ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఇందులో జవహర్ మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ అనంతరం వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఐకమత్యంతో పరిష్కరించుకోవాలని కోరారు. ఆల్ ఇండియా బ్యాంక్ రిటైర్డ్ ఫెడరేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి వారణాసి కృష్ణమూర్తి, ఏపీ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎ.యల్లారావులు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో అన్ని బ్యాంకుల అధికారులు, ఉద్యోగ సంఘాల పోరాటాల ద్వారా ఫ్యామిలీ పెన్షన్ 1.97 లక్షల మందికి సాధించుకోగలిగామని పేర్కొన్నారు. బ్యాంక్ యాజమాన్యాలు జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర జోనల్, రీజినల్ స్థాయి అధికారులు అమలు చేయడంలో కాలయాపన చేయడం బాధాకరమని తెలిపారు. దీనిపై తగిన రీతిలో కార్యాచరణ ప్రణాళిక ద్వారా త్వరలో సాధించుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు కె.హరిబాబు కూడా మాట్లాడారు. పారిశ్రామికవేత్త ఎస్.కోటేశ్వరరావును సత్కరించారు. జిల్లా బ్యాంక్ రిటైరీస్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి మురళీ కృష్ణారావు, తెలంగాణ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్వీ రమణ, వై.కోటేశ్వరరావు, హనుమంతరావు, వెంకయ్య, నిరంజన్ కుమార్, సుందరరెడ్డి, నాగార్జున, కళ్యాణ్, రాజశేఖర్, శివ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment