బరితెగించారు
కోర్టు ఆదేశాలను ధిక్కరించి పచ్చనేతలు బరితెగించారు. బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడి పందేల బరులను ఏర్పాటు చేశారు. సోమవారం పందేలను యథేచ్ఛగా నిర్వంచారు. పందేలను తిలకించేందుకు వచ్చే వారికి సకల సౌకర్యాలు ఏర్పాటుచేశారు. కోడి పందేలతోపాటు జూదం, గుండాట, పేకాట నిర్వహిస్తున్నారు. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. పచ్చ నేతలు మాత్రం రెండు చేతులా సంపాందించుకుంటున్నారు. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం మినహా కనీసం బరుల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. అక్కడక్కడ అరెస్టులు చూపి ఫోజులిస్తున్నారు.
పచ్చ నేతల ఆధ్వర్యంలో జిల్లాలో జోరుగా కోడిపందేలు
సాక్షిప్రతినిధి,బాపట్ల/రేపల్లెరూరల్: పచ్చ నేతల ఆధ్వర్యంలో జిల్లాలో భోగి పండుగ రోజే కోడిపందేలు జోరందుకున్నాయి. ఇక సంక్రాంతి, కనుమ రోజుల్లో పతాక స్థాయికి చేరనున్నాయి. బరుల్లో కోడిపందేలే కాక పేకాట, ఇతర పలురకాల జూద క్రీడలు నిర్వహిస్తున్నారు. ఈ ఆటల నిర్వహణను హైదరాబాద్‌కు చెందిన వారికి రూ.33 లక్షలకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు సమాచారం. రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో కోడిపందేలు, పేకాట ప్రతి ఏటా పెద్దఎత్తున నిర్వహించడం పరిపాటిగా మారింది.
● మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గంలోని చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం వద్ద 30 ఎకరా ల్లో ఆరు బరులు ఏర్పాటు చేయగా సోమవా రం ఉదయం నుంచి కోడి పందేలు మొదలు పెట్టారు. రూ.20 వేల నుంచి రూ.6 లక్షల వరకు పందేలు నడిచాయి. వరుసగా ఐదు పందేలు గెలిచిన వారికి టూ వీలర్‌ను నిర్వాహకు లు ప్రోత్సాహక బహుమతిగా పెట్టారు. బహు మతి గెలిచిన వారినుంచి నిర్వాహకులు 15 నుంచి 20 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు.
● మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరు నియోజకవర్గంలో కొల్లూరు శివారులోని బోస్‌నగర్, అనంతవరం, వేమూరు మండలం జంపని, చుండూరు మండలం కేఎన్ పల్లి, భట్టిప్రోలు మండలం పల్లెకోన ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు. రూ.20 వేల నుంచి రూ.4 లక్షల వరకూ తొలిరోజు పందాలు నడిచాయి. తొమ్మిది పందాల్లో ఐదు గెలిచిన జట్టుకు నిర్వాహకులు బుల్లెట్ బండిని ప్రోత్సాహక ఆఫర్ పెట్టారు. రాబోవు రెండు రోజుల్లో పందేలు మొత్తంతోపాటు పై పందేలు రూ. కోట్లలో పెరగనున్నాయి.
మంతెనవారిపాలెంలో తొలిసారి బరి
రాజుల అడ్డా పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెంలో తొలిసారి బరి ఏర్పాటు చేసి కోడిపందేలతోపాటు పలు రకాల జూదక్రీడలకు తెరతీశారు. గతంలో కొందరు రాజులు సంక్రాంతికి కోడిపందేలు ఆడేందుకు భీమవరం వెళ్లేవారట. ఇప్పుడు బాపట్ల నుంచి రాజుల సామాజికవర్గానికి చెందిన నరేంద్రవర్మ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో రాజులు ఈసారి ఏకంగా మంతెనవారిపాలెంలో 40 ఎకరాల విస్తీర్ణంలో జిల్లాలోనే అతిపెద్ద బరిని ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి కోడిపందేలు మొదలు పెట్టారు. ఇక్కడ వరుసగా మూడు పందాలు గెలిచిన వారికి బుల్లెట్ బహుమతిగా పెట్టారు. పందెం రూ.50 వేలనుంచి రూ.6 లక్షలు పెట్టారు. బహుమతిలో ఇక్కడ నిర్వాహకులు 20శాతం కమీషన్ వసూలు చేస్తున్నట్లు సమాచారం.
రూ. 10 లక్షలకు తగ్గకుండా పై పందాలు
కోడిపందేల వద్ద తొలిరోజు కోట్లలో చేతులు మారగా అంతకు మించి పైపందాలు నడిచినట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఆటగాళ్లు రూ.10 వేల నుంచి రూ.3 లక్షల వరకూ పందాలు కాయగా ఆట చూసేందుకు వచ్చినవారు రూ. వెయ్యి నుంచి రూ.10 లక్షల వరకూ పై పందాలు కాచినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లకు నిర్వాహకులే విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.
పట్టించుకోని పోలీసులు
పచ్చపార్టీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా కోడిపందేలతోపాటు బరులవద్ద పెద్ద ఎత్తున పలురకాల జూద క్రీడలను నిర్వహిస్తున్నా పోలీసులు అటువైపు తొంగిచూడలేదు. కోడిపందేలు నిర్వహిస్తే కేసులు పెడతామని పోలీసులు తొలుత హడావుడి చేశారు. వారం రోజులనుంచి పచ్చపార్టీ కార్యకర్తలు బరులకు ఏర్పాటు చేస్తున్నా పోలీసులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. వేమూరు మండలం జంపనిలో అధికారపార్టీ బరిని ఏర్పాటు చేయగా బరిని నిలిపివేశామని ఇక్కడి పోలీసులు ఆర్భాటంగా ప్రకటించారు. పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెంలో ఎమ్మెల్యే అనుచరులు జిల్లాలోనే పెద్ద బరిని ఏర్పాటు చేయగా బరిని నిర్వహిస్తే కేసులు పెడతామని, ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చామని ఇక్కడి డీఎస్పీతోపాటు పోలీసులు ఆర్భాటంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. తీరా చూస్తే సోమవారం నుంచి ఇక్కడ జిల్లాలోనే పెద్ద ఎత్తున కోడిపందేలు ఇతర జూదక్రీడలు నిర్వహిస్తున్నారు. ఆటగాళ్లకు భోజనాలు కూడా ఏర్పాటు చేయడంతో జిల్లాతో పాటు చుట్టుప్రక్కల జిల్లాల జూదరులు ఇక్కడికే తరలివస్తున్నారు. ఇంతరుగుతున్నా పోలీసులు కన్నెత్తి చూడడంలేదు.
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇలాఖాలో ఐదు బరులు మంత్రి అనగాని సత్యప్రసాద్ అడ్డాలో ఒకే పెద్ద బరి మంతెనవారిపాలెంలో ఎమ్మెల్యే నరేంద్రవర్మ అనుచరుల భారీ బరి కొన్ని బరుల్లో ఆటకు రూ.6 లక్షలు మరి కొన్నింటిలో రూ.4 లక్షలు మంతెనవారిపాలెంలో వరుసగా మూడు పందాలు గెలిస్తే బుల్లెట్ కొల్లూరులో తొమ్మిదింటిలో ఐదు ఆటలు గెలిస్తే బుల్లెట్ కోట్లలో పందాలు.. అంతకు మించి పైపందాలు కోడి పందాలతోపాటు అన్నిరకాల జూదాలు నిర్వహణ
ఏరులై పారుతున్న మద్యం
బరుల వద్ద మద్యం ఏరులై పారుతోంది. బ్రాందీ షాపుల యజమానులు ఇక్కడికే మద్యం సరఫరా చేస్తున్నారు. ఒక్కో బరి వద్ద పదుల సంఖ్యలో బెల్టుషాపులు వెలిశాయి. మద్యం తాగి జనం ఆటగాళ్లతోపాటు చూసేందుకు వచ్చినవారు గొడవలు పడుతున్నారు. పోలీసులు లేకపోవడంతో ఘర్షణలు అదుపుతప్పి శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదముంది.
పార్కింగ్ దోపిడీ
అన్ని ప్రాంతాల్లోని బరుల వద్ద పార్కింగ్ పేరుతో నిర్వాహకులు సందర్శకుల నుంచి భారీగా వసూలు చేస్తూ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. పార్కింగ్ వద్ద టూవీలర్‌కు రూ.100 నుంచి 150, ఫోర్ వీలర్‌కు రూ.200 నుంచి 250 వసూలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment