శాస్త్రోక్తంగా అమరేశ్వరునికి ఆరుద్రోత్సవం
అమరావతి: బాల చాముండికా సమేత అమరేశ్వరునికి సోమవారం వేకువజామున మహన్యాస పూర్వక ఏకాదశ రుద్ర అన్నాభిషేకాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం దాతల సహకారంతో నాలుగు క్వింటాళ్ల బియ్యాన్ని అన్నంగా వండి స్వామికి అభిషేకించారు. ఈఓ సునీల్‌కుమార్ మాట్లాడుతూ ధనుర్మాసంలో అమరేశ్వరుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం సందర్భంగా అన్నాభిషేకాన్ని నిర్వహించినట్టు వివరించారు. తొలుత అర్చకు లు, వేద పండితులు వెంకటాద్రినాయుని మండపంలో మహాన్యాసం నిర్వహించి అనంతరం 11 అమృతాలతో ఏకదశ రుద్రాభిషేకం, వండి న నాలుగు క్వింటాళ్ల అన్నంతో అభిషేకం చేశా రు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించిన అనంతరం అభిషేకించిన అన్నాన్ని భక్తులకు పంపిణీ చేశారు.
కన్నుల పండువగా శ్రీ గోదారంగనాథ కల్యాణం
మంగళగిరి (తాడేపల్లి రూరల్): మంగళగిరి పట్టణ పరిధిలోని బాపూజీ విద్యాలయంలో నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ గోదా రంగనాథస్వామి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని గోదా రంగనాథుల అనుగ్రహాన్ని పొందారు. ఉదయం గోదా అమ్మవారికి అష్టోత్తరం, తీర్థ ప్రసాద గోష్టి జరిపారు. కార్యక్రమ నిర్వాహకులు తులసీరామ్ దంపతులకు, నాగార్జుబాబు దంపతులకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి మంగళా శాసనాలు అందజేసినట్లు జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు తెలిపారు.
అట్టహాసంగా ప్రారంభమైన ఎడ్ల బల ప్రదర్శన
పర్చూరు (చినగంజాం): తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామంలో సోమవారం ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శన పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న 37వ జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు ఈ నెల 17 వతేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు గోరంట్ల భాస్కరరావు తెలిపారు. ప్రస్తుతం సోమవారం పెద్ద సైజు విభాగంలో పోటీలు ప్రారంభం కాగా కడపటి సమాచారం అందే సమయానికి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన పీఆర్ మెమోరియల్ ఎడ్ల జత 22 క్వింటాళ్ల బండను 25 నిమిషాలలో 4226 అడుగులు దూరం లాగి మొదటి స్థానంలో కొనసాగుతోంది. నేడు జూనియర్స్ విభాగంలో, 15వ తేదీ సబ్ జూనియర్స్ విభాగంలో, 16వ తేదీ సేద్యపు విభాగంలో, 17వ తేదీ పాలపళ్ల విభాగంతోపాటు ఆవుల అందాల పోటీలు కూడా జరుగుతాయన్నారు.
మల్లాయపాలెంలో
కోడి పందేల జోరు
బల్లికురవ: సంక్రాంతి పండగను పురస్కరించుకుని బల్లికురవ మండలం పాత మల్లాయపాలెం గ్రామ సమీపంలో సోమవారం కోడి పందేలు జోరుగా నిర్వహించారు. పాతమల్లాయపాలెం నుంచి సోమవరప్పాడు వెళ్లే రోడ్డు లో కొండబోడు వద్ద పందెం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పందేల జూదరులు భారీగా తరలి రావడంతోపాటు లక్షల్లో పందేలు సాగాయి. కూటమి నేతల ప్రోత్సాహంతోనే పందేలు జోరందుకుంటున్నాయని గ్రామస్తులు తెలిపారు. కోడిపందేలతోపాటు కోతముక్కాట, చిత్తుబొమ్మ, పందెలు కూడా జోరుగా సాగుతున్నట్లు గ్రామస్తులు వివరించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. సోమ వారం ఒక్కరోజే పైపందేలు సుమారు రూ.30 లక్షలకు పైగా చేతులు మారినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో పోలీసుల రాకతో నిర్వాహకులు, జూదరులు పలాయనం చిత్తగించారు.
Comments
Please login to add a commentAdd a comment