![చురుగ్గా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06adnk03-260067_19_31_mr-1738871403-0.jpg.webp?itok=vxNfckZm)
చురుగ్గా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు
అద్దంకి: అద్దంకి పట్టణం నుంచి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారి, సమీపంలో జాతీయ రహదారి ఉండగా, 2026 నాటికి బెంగళూరు–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే అందుబాటులోకి రానుంది. ఈ రహదారి కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి బాపట్ల జిల్లాలోని ముప్పవరం వద్ద జాతీయ రహదారికి అనుసంధానం కానుంది. దాంతో అద్దంకి పరిసర గ్రామాలు, నియోజకవర్గలోని వివిధ గ్రామాల్లోని వారికి బెంగళూరు–విజయవాడ ప్రయాణ సమయం తక్కువ కానుంది.
బెంగళూరు నుంచి బాపట్ల జిల్లాలోని ముప్పవరం వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులను 14 ప్యాకేజీలుగా విభజించారు. అందులో మిగిలిన ప్యాకేజీలు ఇప్పటికే జరుగుతుండగా, ప్రకాశం జిల్లాలోని సోమవరప్పాడు నుంచి అద్దంకి మండలంలోని కొటికలపూడి, వేలమూరిపాడు, దక్షిణ అద్దంకి, ఉత్తర అద్దంకి, కలవకూరు, ముప్పవరం, జాగర్లమూడివారిపాలెం, కొటికలపూడి గ్రామాల్లో 14 నంబరు ప్యాకేజీగా పనులు మొదలయ్యాయి. దానిలో భాగంగా ఇక్కడ తొలుత కల్వర్టులు, పైప్‌లైన్లు, యుటిలిటీ పనులు చేస్తున్నారు.
గుండ్లకమ్మపై మరో వంతెన..
అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామ సమీపంలో ఇప్పటికే గుండ్లకమ్మ నదిపై ఒక వంతెన 1981లో నుంచి అందుబాటులో ఉండగా, సమీప గ్రామమైన కొటికలపూడి–వేలమూరిపాడు గ్రామాల మధ్య మరో వంతెన అందుబాటులోకి రానుంది. రూ.703 కోట్లతో ఈ వంతెన నిర్మాణానికి డ్రిల్లింగ్ పనులు మొదలయ్యాయి.
రహదారి వివరాలు
ఈ రహదారి ఆరు లైన్లతో 14వ నంబరు ప్యాకేజీలో 28.64 కిలోమీటర్ల పొడవున నిర్మాణం కానుంది. ఈ రహదారి 70 మీటర్ల వెడల్పుతో నిర్మించనుండగా, రెండు వైపులా ప్లాంటేషన్, కొన్ని ప్రాంతాల్లో మినహా మధ్యలో డివైడర్, అద్దంకి, ముప్పవరం ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో మినహా మరెక్కడా వాహనాలకు ప్రవేశ ద్వారాలు ఉండవు. పట్టణంలోని ఒంగోలు రహదారిని క్రాస్ అయ్యే ప్రాంతంలో రెండు ఔటర్ రింగ్‌లు, చిన్నచిన్న వాహనాలు పోవడానికి అవకాశం కల్పించనున్నారు. మిగిలిన చోట్ల రహదారి నుంచి క్రాస్ అయ్యే సమయంలో అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. ఈ రహదారిలో వేగం కూడా అధికంగా ఉంటుంది. 120 నుంచి 150 కిలోమీటర్ల వేగం ఉంటుందని అంచనా. దాంతో అద్దంకి పరిసర ప్రాంతాల్లో వ్యాపార, రవాణా, అత్యధిక దూరంలోని బెంగళూరు, విజయవాడ ప్రాంతాల మధ్య ప్రయాణం సమయం బాగా తగ్గనుంది.
అద్దంకిలో సాగుతున్న 14వ
ప్యాకేజీ పనులు
గుండ్లకమ్మపై మరో వంతెన
అద్దంకి–ముప్పవరం దగ్గర
హైవేలోకి వాహన ప్రవేశాలు
2026కి పూర్తి కానున్న బెంగళూరు–
విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే
Comments
Please login to add a commentAdd a comment