![హైస్కూల్ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/20/19wra61r-192027_mr_0.jpg.webp?itok=jBvuDRRP)
హైస్కూల్ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు
జూలూరుపాడు: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదుట మంగళవారం పీడీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు, యువజన, మహిళా సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. స్థానిక హైస్కూల్‌లో పీడీగా విధులు నిర్వర్తిస్తున్న అరుణకుమారి తన కారును ఈ నెల 15న 8వ తరగతి విద్యార్థుల చేత కడిగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి పవన్‌కుమార్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ మాట్లాడారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) అరుణకుమారి విద్యార్థులతో తన సొంత కారును కడిగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పీడీని తక్షణమే స్పందించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బోడా అభిమిత్ర, ఎస్కే చాంద్‌పాషా, ఆనగంటి లక్ష్మి, లక్కినేని అపర్ణ, కమ్మూరు జ్యోతి పాల్గొన్నారు.
పీడీకి షోకాజ్ నోటీస్..
ఈ విషయంపై జూలూరుపాడు హైస్కూల్ హెచ్‌ఎం లక్ష్మీనర్సయ్యను వివరణ కోరగా పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న అరుణకుమారికి సోమవారం డీఈఓ వెంకటేశ్వరాచారి ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ఈ నెల 15న పీడీ అరుణకుమారి తన కారును 8వ తరగతి విద్యార్థుల చేత శుభ్రం చేయిస్తుండగా కొందరు వీడియో తీసి డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు హెచ్‌ఎం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment