పీహెచ్‌సీలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తనిఖీ | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తనిఖీ

Published Wed, May 8 2024 3:10 AM

పీహెచ

పాల్వంచరూరల్‌: మండలంలోని ఉల్వనూరు పీహెచ్‌సీని మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుకృత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు, వైద్య సిబ్బందితో ఆమె మాట్లాడారు. వేసవిలో ప్రజలు వడదెబ్బకు గురై ఆస్పత్రికి వస్తే సత్వర వైద్యం అందించాలని పేర్కొన్నారు. అందుబాటులో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఉంచాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సకాలంలో మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో సర్వే చేసి జ్వరపీడితులను గుర్తించాలని, ప్రభుత్వాస్పత్రుల్లోనే కాన్పులయ్యేలా ప్రోత్సహించాలని చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు తేజస్వి, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లి గుడిలో దుకాణాలకు నేడు వేలం

పాల్వంచరూరల్‌: మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో దుకాణాలు అప్పగించేందుకు బుధవారం వేలం నిర్వహిస్తున్నట్లు ఈఓ జి.సుదర్శన్‌ తెలిపారు. ఆలయ సముదాయంలోని 1 నుంచి 4వ నంబర్‌ దుకాణాలతో పాటు తలనీలాలు, చీరలు పోగు చేసుకోవడం, పూలదండల విక్రయం, ఫొటో తీసేందుకు మూడేళ్ల పాటు హక్కు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, టికెట్లు, వాల్‌పోస్టర్ల ప్రింటింగ్‌, పూల దండలు, ఎలక్ట్రికల్‌ సామగ్రి, స్టేషనరీ, పాలు, పెరుగు, కూరగాయల సరఫరా పది నెలల కాలపరిమితితో అప్పగిస్తామని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉదయం 10 గంటల్లోగా రూ.200 చెల్లించి షెడ్యూల్‌ తీసుకోవాలని, అందులో పేర్కొన్నట్లుగా ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనాలని ఈఓ సూచించారు.

రూ.2.50 లక్షల నగదు సీజ్‌

మణుగూరు రూరల్‌ : సరైన ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.2.50 లక్షల నగదును ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో మణుగూరు సీఐ సతీష్‌కుమార్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సభ్యులు మంగళవారం సీజ్‌ చేశారు. పట్టణంలో అంబేద్కర్‌ సెంటర్‌లో సీఐ సతీష్‌కుమార్‌ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ ద్విచక్ర వాహనదారుడు రూ.2.50 లక్షలను తీసుకెళ్తున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు సోదా చేయగా.. అతడి వద్ద రూ.2.50 లక్షల నగదు లభ్యమైంది. సీజ్‌ చేసిన నగదును ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బందికి అందజేశారు.

యువతి అదృశ్యం

అశ్వారావుపేటరూరల్‌: యువతి కనిపించకుండా పోయిన ఘటనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శ్రీను కథనం ప్రకారం.. అశ్వారావుపేట నందమూరినగర్‌కు చెందిన 22 ఏళ్ల యువతి సోమవారం ఉదయం సత్తుపల్లిలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వెళ్లి తిరిగి రాలేదు. యువతి కుటుంబీకులు బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసినా ఆచూకీ దొరకలేదు. యువతి తల్లి మంగళవారం రాత్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

శివాలయంలో చోరీ

ములకలపల్లి: ములకలపల్లి శివారులోని ఉమాపృథ్వీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం ఉదయం గుడి తలుపులు తెరచి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా.. గర్భగుడి తలుపుల తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఉత్సవమూర్తుల రెండు వెండి కిరీటాలు, శఽఠగోపం, దేవతామూర్తుల రెండు జతల బంగారు మంగళసూత్రాలు, హుండీలోని సుమారు రూ.ఐదు వేలు చోరీ అయినట్లు గుర్తించారు. ఈ మేరకు ఎస్సై రాజమౌళి వివరాలు సేకరించారు. ఆలయ అర్చకులు విస్సావజ్జుల సురేశ్‌ శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

యువకుడిపై పోక్సో కేసు నమోదు

సుజాతనగర్‌ : ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిపై సుజాతనగర్‌ పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. యువతితో కలిసి ఫొటోలు దిగిన యువకుడు.. తనను ప్రేమించకపోతే ఫొటోలు అందరికీ చూపిస్తానని బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జుబేదాబేగం తెలిపారు.

పీహెచ్‌సీలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తనిఖీ
1/1

పీహెచ్‌సీలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తనిఖీ

Advertisement

తప్పక చదవండి

Advertisement