తీగలాగితే డొంక కదిలింది !
‘జూలూరుపాడు దంపతుల ఆత్మహత్య’ కేసులో మలుపులు
● ఆ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న మహిళ దారుణ హత్య ● ఆత్మహత్య కేసులో సెటిల్‌మెంటే ప్రస్తుత మర్డర్‌కు కారణం? ● గతంలో నమోదైన కేసులకు ప్రస్తుత హత్యకు సంబంధాలు !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గత సెప్టెంబర్‌లో జూలూరుపాడులో జరిగిన దంపతుల ఆత్మహత్య కేసు విషయంలో తీగ లాగితే డొంక కదిలినట్టుగా పలు అంశాలు బయటపడుతున్నాయి. వివాహేతర సంబంధాలు, అక్రమ పద్ధతుల్లో ఉద్యోగం నేపథ్యంలో జరిగిన నేరాలు, వాటిని కప్పిపుచ్చేందుకు చేసిన సెటిల్‌మెంట్లు ఒక్కొక్కటిగా బటయకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం కలిగిన నలుగురు చనిపోయారు.
సింగరేణి దందాతో మొదలు..
పెద్దపల్లి జిల్లాకు చెందిన స్వాతికి గతంలో మణుగూరుకు చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే భర్త చనిపోవడంతో కొత్తగూడెంలో ఓ పాఠశాలలో పని చేస్తుండగా జులూరుపాడు మండలం మాచినేనిపేటకు చెందిన వీరభద్రంతో పరిచయమైంది. అప్పటి నుంచి వారిద్దరు సహజీవనంలో ఉన్నారు. ఆ తర్వాత వీరభద్రంకు మరో యువతితో వివాహమైంది. కాగా, ఇదే మండలం సాయిరాంతండాకు చెందిన రత్నకుమార్, పార్వతి దంపతులు కొత్తగూడెంలో ఓ షాపింగ్‌మాల్‌లో పని చేసే సమయంలో స్వాతితో పరిచయమైంది. సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తానన్న స్వాతి మాటలు నమ్మి వారు రూ.16లక్షలు ఇచ్చారు. చివరకు మోసపోయామని గ్రహించి సెప్టెంబర్ 30 ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనిపై చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
సెటిల్‌మెంట్ ఆరోపణలు..
ఆ కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న స్వాతిని చుంచుపల్లి పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా సింగరేణిలో ఉద్యోగాల పేరుతో జరిగే దందా ఎలా ఉంది ? అమాయకులెలా బలవుతున్నారు? పార్వతి, రత్నకుమార్ చనిపోవడానికి ముందు జరిగిన సంఘనలు ఏంటనే అంశంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదనే ఆరోపణలు వస్తున్నాయి. రూ.16 లక్షల చుట్టూనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. చివరకు బాధిత కుటుంబాలకు రూ.8 లక్షలు ఇవ్వాలనే షరతులపై ‘ఓ ఖాకీ’ ఈ వివాదాన్ని సెటిల్ చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అంతేకాదు ఆత్మహత్య కేసు మెడకు చుట్టుకోకుండా రాజీ చేసినందుకు సదరు ఖాకీకి నజరానాగా రూ.8 లక్షలు ఇవ్వాలనే ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఈ డీల్ ప్రకారం బాధితుల కుటుంబాలకు రూ.8 లక్షలు, డీల్ సెట్ చేసిన ఖాకీకి రూ.8 లక్షలు ఇచ్చేందుకు నెల గడువు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో రూ.8 లక్షలతో రాజీ కుదిరినట్టు మీడియా ముఖంగా పోలీసులు ధ్రువీకరించారు.
ఒత్తిడి రావడంతో
సెటిల్‌మెంట్ జరిగి నెల దాటడంతో నగదు చెల్లించాలంటూ స్వాతిపై నలువైపులా ఒత్తిడి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై వీరభద్రం, స్వాతి మధ్య పలుమార్లు వివాదం జరగడంతో.. ఆమెను తప్పిస్తే తనకే సంబంధం లేకుండా పోతుందనే నిర్ణయానికి వీరభద్రం వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అప్పటికే నేర చరిత్ర ఉండటంతో పక్కా ప్లాన్‌తో స్వాతిని మట్టుబెట్టి ఊరి చివర తన చేలోనే పాతిపెట్టాడు. మరోవైపు సెటిల్‌మెంట్ నజరానా రాకపోవడంతో సదరు ఖాకీ నిఘా వీరభద్రంపై పెరిగింది. దీంతో స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా హత్య విషయం వెలుగు చూసినట్టుగా ప్రచారం జరుగుతోంది.
తొలి కేసప్పుడు జాగ్రత్త పడితే..
ఆత్మహత్యలు – హత్య కేసులో తొలి బీజం సెప్టెంబర్ 27న పడింది. వీరభద్రం భార్యపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడంతో జూలురుపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత రెండు రోజులకే పార్వతి–రత్నకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత మరో కేసు నమోదైంది. అంతకు 20 రోజుల ముందు స్వాతి దగ్గర సింగరేణిలో ఉద్యోగం పేరుతో డబ్బులు తీసుకున్న వ్యక్తి కూడా అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. తొలి కేసు నమోదైన తర్వాత లోతైన విచారణ జరిపితే కనీసం మూడు నిండు ప్రాణాలు దక్కేవి. నేరాలకు పాల్పడిన వారికి చట్ట ప్రకారం శిక్షలు పడేవి. కానీ విచారణలో నిర్లక్ష్యం, సెటిల్‌మెంట్‌పై ఉత్సాహంతో ఈ కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది.
స్వాతిపై కేసులేమీ లేవు
పార్వతి – రత్నకుమార్ ఆత్మహత్య కేసులో స్వాతిపై ఆరోపణలు రావడంతో విచారించాం. అయితే ఆ ఆత్మహత్యలకు స్వాతికి ఏ సంబంధం లేదని తేలడంతో ఆమైపె ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దంపతుల ఆత్మహత్య విషయంలో పోలీసులు సెటిల్‌మెంట్ చేశారనే ప్రచారంలో వాస్తవం లేదు.
– అబ్దుల్ రెహమాన్, కొత్తగూడెం డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment