నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుగ గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితరపూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, మంత్రపుష్పం, నివేదన, హారతి తదితర కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. కార్తీకమాసం సందర్భంగా ఆకాశదీపోత్సవం, దీపారాధన చేశారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, అర్చకులు, వేదపడింతులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
ఆదివాసీలకు సంక్షేమ ఫలాలు అందాలి
భద్రాచలంఅర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ యోజన పథకాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని, తద్వారా ఆదివాసీ గిరిజనులకు సంక్షేమ ఫలాలు అందించాలని ట్రైకార్ జీఎం శంకర్ రావు అధికారులకు సూచించారు. ఐటీడీఏలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని అర్హులకు అందేలా చూడాలని అన్నారు. ప్రతీ పంచాయతీలలో ప్రత్యేకంగా గ్రామసభలు ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి చర్యలు చేపట్టాలని, గ్రామస్తుల సమక్షంలో చేసిన తీర్మానాలు, ప్రతిపాదనలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, డీఐఓ సుశీల్, ఏఓ రాంబాబు, జీసీడీఓ అలివేలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.
సర్వే వేగవంతం చేయండి
చండ్రుగొండ : ఇంటింటి సమగ్ర సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్య ప్రణాళికా అధికారి సంజీవరావు మండల అధికారులకు సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. సర్వే తీరుతెన్నులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్యుమరేటర్లు చేస్తున్న సర్వేను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, ఏపీఎం సంతోష్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ ప్రసన్న, ఆర్‌ఐ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్
ఆర్‌ఎం
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు తెలుసుకుని సూచనలు స్వీకరించేందుకు శుక్రవారం డయల్ యువర్ ఆర్‌ఎం కార్య క్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రీజియన్ పరిధిలోని సమస్యలను వెల్ల డించేలా ఆర్‌ఎంతో మాట్లాడేందుకు మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు 99592 25954 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment