గుడిసెలు తొలగించిన అటవీ అధికారులు
అశ్వారావుపేటరూరల్: రిజర్వ్ ఫారెస్టు భూమిలో నిరుపేద గిరిజనులు ఏర్పాటు చేసుకున్న గుడిసెలను శనివారం అటవీ శాఖ అధికారులు తొలగించారు. దీంతో గిరిజనులు, అటవీ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, రహదారిపై ధర్నా చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. మండలంంలోని తిరుమలకుంట ఫారెస్టు సెక్షన్ మామిళ్లవారిగూడెం బీట్ పరిధిలోని వినాయకపురం సమీపంలోగల ఎర్రగుంటపల్లి వద్ద రెండు రోజుల కిందట స్థానిక సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలోని రిజర్వ్ ఫారెస్టు భూమిలో సుమారు వందమంది గిరిజన కుటుంబాలు గుడి సెలు ఏర్పాటు చేశాయి. కాగా, రెండేళ్లుగా ఈ స్థలం విషయంలో స్థానిక గిరిజనులు, అటవీ అధికారులకు మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే వారంతా తాజాగా గుడిసెలు, డేరాలను ఏర్పాటు చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న అశ్వారావుపేట, దమ్మపేట ఫారెస్టు రేంజర్లు కరుణాకర్‌చారి, మురళితోపాటు మరో 80 మంది అటవీ సిబ్బంది గిరిజనులు అక్రమించిన ప్రాంతానికి చేరుకొని గుడిసెలను పూర్తిగా తొలగించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసు కోగా, అధికారులను అడ్డుకున్న గిరిజనుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకొని దమ్మపేట ఫారెస్టు రేంజ్ కార్యాలయానికి తరలించారు. దాంతో ఆగ్రహించిన గిరిజనులు మామిళ్లవారిగూడెం – వినాయకపురం ప్రధాన రహదారిపై దాదాపు గంట పాటు ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ యయాతి రాజు ఘటనా స్థలానికి చేరుకొని ధర్నా చేస్తున్న గిరిజనులతో మాట్లాడి, ధర్నాను విరమింపజేశారు. అనంత రం గిరిజనులంతా గుడిసెలు ఏర్పాటు చేసుకున్న భూమిలో నే బైఠాయించగా.. ఫారెస్టు రేంజర్లు గిరిజనులతో మాట్లాడారు. రిజర్వ్ ఫారెస్టులో అక్రమంగా గుడిసెలు ఏర్పాటు చేస్తే తొలగిస్తామని, ఇళ్ల స్థలాల సమస్యను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో గిరిజనులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇరువర్గాల మధ్య వాగ్వాదం
Comments
Please login to add a commentAdd a comment