పూజల పేరిట రూ.55 లక్షలు టోకరా
●భద్రాద్రి జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్‌తో పాటు నలుగురి అరెస్ట్ ●రూ.34 లక్షల విలువైన సొత్తు స్వాధీనం ●వివరాలు వెల్లడించిన జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్
జనగామ : మాయలు చేస్తాం.. మంత్రాలు చేస్తాం.. దోషాలను నివారిస్తామంటూ మాయమాటలతో బురిడీ కొట్టిస్తూ అమాయకులను మోసగించి రూ.లక్షల్లో దండుకున్న ముఠాను జనగామ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమేరకు జనగామ పోలీస్‌స్టేషన్‌లో శనివారం డీసీపీ రాజమహేంద్రనాయక్ వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ భట్టు నాగదేవికి మూడేళ్ల క్రితం జనగామ బాణాపురానికి చెందిన కారు డ్రైవర్ పాముకుంట్ల సందీప్ పరిచయమయ్యాడు. 2023 అక్టోబర్ 10న ఇద్దరు వివాహం చేసుకున్నారు. నాగదేవి భిక్షాటన ద్వారా వచ్చే డబ్బు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా జనగామకు చెందిన సిరివెన్నెల, ఆమె తమ్ముడు నిఖిల్ వద్దకు 2024 అక్టోబర్ 1వ తేదీన నాగదేవి, సందీప్ వెళ్లారు. అక్కాతమ్ముడికి మాయమాటలు చెప్పి వారి ఇంట్లో ఉన్న దోషాలను తొలగించేందుకు పూజలు చేస్తామంటూ నమ్మబలికి సిరివెన్నెల, ఆమె తమ్ముడి నుంచి దఫాలుగా రూ.55లక్షల నగదు, ప్లాట్ డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఈ విషయమై బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమాన ఏసీపీ పార్థసారధి, సీఐ దామోదర్‌రెడ్డి నెహ్రూ పార్క్ వద్ద శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా నాగదేవి, సందీప్, వారికి సహకరించిన మెతుకు గణేశ్, గుగులోత్ నవీన్, భూక్యా గణేశ్ పట్టుబడ్డారు. వీరిలో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకోగా 30 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.10 లక్షల విలువైన భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు, కారుతో పాటు ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన 4.6 గ్రాముల బంగారం రశీదులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ రాజమహేంద్రనాయక్ తెలిపారు. కాగా, 24 గంటల్లోనే కేసును ఛేదించిన ఏసీపీ, సీఐలను సీపీ అభినందించారని డీసీపీ వెల్ల డించారు.
Comments
Please login to add a commentAdd a comment