ఆలయ నిర్వహణలో రెండువర్గాలు
పాల్వంచ: పాల్వంచలోని అయ్యప్ప స్వామి ఆలయ పాలకవర్గంలో రెండు గ్రూపులు ఏర్పడటం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆలయాన్ని ఒకరు ట్రస్ట్‌గా, మరొకరు నూతన కమిటీగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఇదిలా ఉండగా ఆలయ ఆవరణలో శుక్రవారం నూతన కమిటీ ఏర్పాటు చేసినట్లు ఫ్లెక్సీలను తొలగించారని ఎదుటి వర్గం శనివారం ఆందోళనకు దిగడం గమనార్హం. అయ్యప్పస్వామి ఆలయానికి పదేళ్లుగా నూతన కమిటీని నియమించకపోవడంతో భక్తుల నుంచి డిమాండ్ వస్తోంది. ఈ నేపధ్యాన ముగ్గురికి బాధ్యతలు అప్పగించగా వారు కాలయాపన చేయడమేకాక ట్రస్ట్‌గా రెండు నెలల కిందట రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో కొత్వాల శ్రీనివాసరావు, సంతోష్ గౌడ్, కాల్వ భాస్కర్, కనగాల రాంబాబు, వేమారెడ్డి, బందెల శ్రీను, మిరియాల కమలాకర్ ఉన్నారు. ఈ విషయం తెలియడంతో మరో వర్గం వారు కొత్త కమిటీని రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో అజ్మీర రామదాసు, కొత్తచెరువు హర్షవర్ధన్, ముగిది శ్రీనివాస్‌రావు, మారుతి నాగేశ్వరరావు, జుజ్జూరి ప్రభాకరాచారి, రచ్చ పురుషోత్తం, పైడి నాయుడు సహా 40 మంది సభ్యులు ఉన్నారు. ఈ మేరకు కొత్త కమిటీ ఆధ్వర్యాన ఆలయంలో శుక్రవారం ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా, శనివారం ఉదయం కల్లా చించేసి ఉంది. దీంతో వారు బీసీఎం రహదారిపై ధర్నాకు దిగగా పోలీసులు సర్దిచెప్పడంతో ఆలయం ముందు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేళ్లుగా కమిటీ వేయకపోగా, గుట్టుచప్పుడు కాకుండా ట్రస్ట్‌గా మార్చారని ఆరోపించారు. భక్తులు సమర్పించే నిధుల ఆదాయ, వ్యయాలు కూడా చెప్పడం లేదని, నాలుగు కుంటల భూమిని విక్రయించారని తెలిపారు. కార్యక్రమంలో హర్షవర్దన్, వెంకటేశ్వర్లు, శ్రీను తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment