స్వర్ణకవచధారణలో రామయ్య దర్శనం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అ మ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు గావించారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు.
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
భద్రాచలం: రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం భద్రాచలంలో పర్యటించనున్నారు. ఉదయం సీతారామ చంద్రస్వామివారిని దర్శించుకోనున్నారు. స్థానిక ఏఎంసీ కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించాక జిల్లా అధికారులతో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన శ్రేణులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొనాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఒక ప్రకటనలో కోరారు.
నేటి నుంచి అంతర్రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు
భద్రాచలంటౌన్: భద్రాచలం కేంద్రంగా నేటి నుంచి 3వ అంతర్రాష్ట బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ భద్రాచలం ప్రెసిడెంట్ యేగి శివ శంకర్ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని సీతారామ ఆఫీసర్స్ క్లబ్‌లో రెండురోజుల పాటు జరిగే ఈ పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మొదటి, రెండో, మూడో, నాలుగో బహుమతులు వరుసుగా రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, ఎలిమినేటర్లకు రూ.2,500 అందిస్తామని తెలిపారు.
‘కుడా’ ఏర్పాటుపై
హైకోర్టులో పిటిషన్
కొత్తగూడెంఅర్బన్: కుడా ఏర్పాటయితే గిరిజనులకు అన్యాయం జరుగుతుందని కొత్తగూడేనికి చెందిన భూక్య సాయికిరణ్ రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కొత్తగూడెం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఏర్పాటుకు ప్రభుత్వం జీఓ 177 ద్వారా ఆమోదం తెలిపిన విషయం విదితమే. శుక్రవారం పిటిషనర్ తరపున న్యాయవాది జి.రవిచంద్రశేఖర్, ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ ప్లీడరు వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం.. గవర్నమెంట్ ప్లీడర్‌ను కౌంటర్ ద్వారా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కేసును డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. కాగా కుడా ఏర్పాటుతో ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కినట్లు అవుతుందని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల వారు, ముఖ్యంగా గిరిజనులు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కుడా ఏర్పాటుతో జాతీయ ఉపాధి హామీ వర్తించదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment