కార్పొరేట్‌కు దీటుగా విద్య, వసతులు
పాల్వంచరూరల్: కార్పొరేట్ కళాశాలలకు దీటుగా గిరిజన కళాశాలలో వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యనందిస్తున్నామని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను శుక్రవారం న్యాక్ బృందం పరిశీలించింది. బృందం చైర్మన్ డాక్టర్ వేణుగోపాల్, కోర్డినేటర్ శ్యామ్‌నందసింగ్, సభ్యులు డాక్టర్ ఆషీమోగక్కర్‌లను పీఓ మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడారు. నిష్ణాతులైన ఫ్యాకల్టీతో విద్యాబోధన సాగుతోందని, ల్యాబోరేటరీ సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థినుల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వివరించారు. జేఈఈ, నీట్, ఎంసెట్ కోచింగ్ కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాంక్‌లు సాధించిన విద్యార్థినులు ఇంజనీరింగ్, మెడిసిన్ పూర్తి చేసేందుకు ఐటీడీఏ ద్వారా ఆర్థికసాయం చేస్తున్నామని చెప్పారు. ప్రతినెలా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి విద్యార్థినుల అభ్యాసన స్థాయిని వివరిస్తున్నామని తెలిపారు. ఆటవిడుపుగా విహారయాత్రలకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఆర్‌సీఓ నాగార్జునరావు, కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ పాల్గొన్నారు.
వందశాతం ఫలితాలు సాధించాలి
భద్రాచలం: ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం నుంచి శుక్రవారం ఆయన ఉమ్మడి జిల్లాలోని గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎం, వార్డెన్, ప్రిన్సిపాల్, సబ్జెక్ట్ టీచర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాతం మెరుగుపర్చాలని అన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు, ఎస్‌సీఆర్పీలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు పాఠశాలలను పర్యవేక్షించాలని చెప్పారు. డిసెంబర్ మొదటివారంలో ఎస్జీటీలకు ఉద్దీపకం 60 రోజుల శిక్షణ పూర్తి చేసి, అనంతరం పాఠశాలల్లో 100 రోజుల ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. మెరుగైన ఫలితాలు రాకపోతే ఉపాధ్యాయులపై శాఖపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్
గిరిజన మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించిన న్యాక్ బృందం
Comments
Please login to add a commentAdd a comment