లెక్కల చిక్కుముడులు విప్పేలా..
గణితఫోరం ఆధ్వర్యాన పోటీలు, ఉపాధ్యాయులకు శిక్షణ
● ఏటా మండల స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు పోటీలు ● విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా నిర్వహణ ● నేడు శ్రీనివాస రామానుజన్ జయంతి, జాతీయ గణిత దినోత్సవం
ఖమ్మంసహకారనగర్: అందరి దైనందిన జీవితంలో గణితంతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. నిద్ర లేచించి మొదలు రాత్రి వరకు అన్ని అంశాలు గణితంతో ముడిపడి ఉంటాయి. కానీ పాఠశాల స్థాయిలో కొందరు విద్యార్థులు భయంతో గణితంలో వెనుకబడుతుంటారు. ఈనేపథ్యాన వారిలో భయాన్ని పోగొట్టి సులభ సూత్రాల ద్వారా బోధించేందుకు ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇస్తూనే.. విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా ఏటా తెలంగాణ మ్యాథ్స్ ఫోరం(టీఎంఎఫ్) ఆధ్వర్యాన మండలం మొదలు రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తున్నారు. 2016లో మొదలైన ఈ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు పలువురు రాష్ట్ర స్థాయికి ఎంపికై సత్తా చాటుతున్నారు. గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఏటా డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యాన జిల్లాలో టీఎంఎఫ్ కార్యకలాపాలపై కథనం.
విద్యార్థులు పట్టు సాధించేలా..
ఇంగ్లిష్‌తోపాటు గణితానికి నిత్య జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే గణితంపై పట్టు అవసరం. బ్యాంక్ ఉద్యోగాలు, సీఏ, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీ పరీక్షల్లో గణితంలో అత్యధిక మార్కులు సాధిచడమే కీలకం. దీంతో హైస్కూల్ స్థాయిలోనే విద్యార్థుల్లో ఈ సబ్జెక్టుపై ఆసక్తి పెంచేలా టీఎంఎఫ్ కృషిచేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో ఏటా పరీక్షలు నిర్వహిస్తుండడంతో పాటు ఉపాధ్యాయులకు కూడా అవగాహన పెంచేలా కృషి చేస్తోంది.
నవంబర్ నుంచి ప్రారంభమై..
ఈ ఏడాది నవంబర్ 24న మండల స్థాయిలో పోటీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అక్కడ విజయం సాధించిన విద్యార్థులకు ఈనెల 11న జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించగా రాష్ట్ర స్థాయి పరీక్ష ఆదివారం హైదరాబాద్‌లో జరగనుంది. జిల్లా నుంచి ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియం పాఠశాలలతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు.
శరత్‌చంద్ర.. గణితంపై మక్కువ
ఇల్లెందు: సాస్మో – 2024 పేరిట నిర్వహించిన ఒలింపియాడ్‌లో ఇల్లెందు సుభాష్‌నగర్‌కు చెందిన మోకాళ్ల శరత్ చంద్ర ప్రతిభ కనబరిచాడు. శరత్ ప్రస్తుతం హైదరాబాద్‌లో చదువుతుండగా గణితంపై మక్కువతో పలు పరీక్షల్లో సత్తా చాటాడు. ఇందులో భాగంగా ఆయన సింగపూర్ ఏసియన్ మాథ్స్ ఒలింపియాడ్(సాస్మో)లో పాల్గొనగా బంగారు పతకం లభించింది. అమెరికన్ మేథమెటిట్స్ కాంపిటేషన్, బిట్స్ పిలానీ ఇన్ఫినిటీ, అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన జరిగిన పోటీల్లో కూడా శరత్ పతకాలు గెలుచుకున్నాడు.
రాష్ట్ర స్థాయిలో జిల్లా విద్యార్థులు..
కొత్తగూడెంఅర్బన్: ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌లో జిల్లా విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు న్యాయనిర్ణేతల మన్ననలు అందుకున్నాయి. అన్నపురెడ్డిపల్లిలోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన బి.అమృత మ్యూజికల్ పార్క్, పాల్వంచ జగన్నాధపురం హైస్కూల్‌కు చెందిన డి.విజయనాయక్ బహుళార్ధక గణిత ఫజిల్, పాల్వంచ త్రివేణి పాఠశా ల విద్యార్థిని పి.సాయిలోహిత పైథాగరస్ థియరీని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చో వివరించారు. ఎగిబిట్లు సైన్స్‌ఫేర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment