ముక్కోటి పనులు సకాలంలో పూర్తి చేయాలి
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 9, 10 తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ఆర్డీఓ దామోదర్ రావు అన్నారు. శనివారం భద్రాచలం సబ్ కలెక్టరేట్‌లో ఉత్సవాల నిర్వహణపై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 6వ తేదీ నాటికి పనులన్నీ పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖ సమన్వయంతో బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. లాడ్జి, హోటల్ యజమానులతో సమావేశం నిర్వహించి ధరలు నిర్ణయించామన్నారు. భద్రాచలం, పర్ణశాల దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. హంస వాహనాన్ని తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. పర్ణశాల, భద్రాచలంలో మొబైల్ టీమ్‌లు, అంబులెన్సులు, ఏరియా ఆస్పత్రిలో పది బెడ్లు, సరిపడా మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఎవరైనా భక్తులు గుండెపోటుకు గురైతే సీపీఆర్ చేసేలా పోలీస్, గ్రామపంచాయతీ సిబ్బందికి ఈ నెల 27న ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ఇన్‌చార్జ్ ఏఎస్పీ రవీందర్ రెడ్డి, ఈఓ రమాదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment