పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి
● డీఈఓ వెంకటేశ్వరాచారి
టేకులపల్లి: పిల్లల బాధ్యత పూర్తిగా ఉపాధ్యాయులపైనే వదిలిపెట్టకుండా తల్లిదండ్రులు కూడా వారిపై శ్రద్ధ పెట్టాలని డీఈఓ ముమ్మడి వెంకటేశ్వరాచారి అన్నారు. మండలంలోని సులానగర్ హైస్కూల్, బొమ్మనపల్లి ప్రాథమిక పాఠశాలలో శనివారం నిర్వహించిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులను ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలల్లో చదివిస్తున్నామని, విద్యార్థులను సకాలంలో పంపించాలని కోరారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెడితేనే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, గతంలో కంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నాటిక, గణిత శాస్త్ర సామర్థ్యాల ప్రదర్శనను అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు సైదులు, సతీష్, నాగరాజశేఖర్, ఎంఈఓ జగన్, హెచ్‌ఎంలు దేవదాసు, మంగీలాల్, శ్రీనివాసరావు, ఎం.జ్యోతిరాణితో పాటు విశాల్, గాయత్రి, నిహిత్, కార్తీక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment