కమ్యూనిస్టు సిద్ధాంతమే శరణ్యం
● ప్రజాసమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి ● బీజేపీ పాలనలో ఎస్టీ, ఎస్సీలకు తీవ్ర అన్యాయం ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వెంకట్ ● ముగిసిన పార్టీ జిల్లా మహాసభలు
ఇల్లెందు : ప్రపంచమంతా కమ్యూనిస్టుల వైపు చూస్తోందని, కమ్యూనిజం సిద్ధాంతాలే ప్రజలకు శరణ్యంగా మారుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.వెంకట్ అన్నారు. ఇల్లెందులో జరుగుతున్న సీపీఎం జిల్లా మహాసభల్లో శనివారం ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రేణులు మిలిటెంట్ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కేరళ తరహాలో క్షేత్ర స్థాయి ఉద్యమాలకు నాంది పలికాలన్నారు. పార్టీ సభ్యులు, కుటుంబాలను నిర్లక్ష్యం చేయొద్దని నాయకులకు సూచించారు. యువతకు పాలకులు ఎన్నో వాగ్దానాలు చేశారని, వాటి అమలుకు ఉద్యమాలు చేపట్టాలని అన్నారు. గ్రామాల్లో 20 శాతం మంది ఉన్న పెత్తందార్లు 80 శాతం మందిని అన్ని విధాలా దోపిడీ చేస్తున్నారని, వారిపై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆచరణలో విఫలమైందని విమర్శించారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు మినహా మిగితావేవీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏ జిల్లాకు వెళ్లినా అక్కడి సీపీఎం నాయకులను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారని, ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. సభలో మాజీ ఎంపీ మిడియం బాబూరావు, రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్ మాట్లాడగా.. అన్నవరపు కనకయ్య నివేదికను ప్రవేశపెట్టారు. అనంతరం పార్టీ మహాసభల ముగింపు సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సభల్లో నాయకులు ఏజే రమేష్, పిట్టల రవి, బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, నబీ, శ్రీధర్, శ్రీను, మండల కార్యదర్శి ఆలేటి కిరణ్, కాళంగి హరికృష్ణ, బయ్యా అభిమన్యు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా నూతన కార్యదర్శిగా మచ్చా..
సీపీఎం జిల్లా నూతన కార్యదర్శిగా మచ్చా వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, కొక్కెరపాటి పుల్లయ్య, ఎం. బాలనర్సారెడ్డి, మందలపు జ్యోతి, కారం పుల్లయ్య, కొలగాని బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, అన్నవరపు సత్యనారాయణ, రేపాకుల శ్రీనివాస్ కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. మరో 23 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment